Mar 04,2023 19:23

కూలిపోయే స్థితిలో ఉన్న వాణిజ్య భవనం

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌: పట్టణంలోని ఆర్‌.ఎస్‌.రోడ్డులోని ఓ ప్రయివేటు ఆస్పత్రి సందులో ఉన్న పాత వాణిజ్య భవనవం కూలేందుకు సిద్ధంగా ఉంది. ఆ భవనాన్ని కొంత తొలగించి అలాగే వదిలేశారు. పూర్తిగా తొలగించకపోవడంతో ఎప్పుడు కూలిపోతుందనే ఆందోళనలో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. భవనం పూర్తిగా నెర్రెలు చీలి కూలిపోయే స్థితిలో ఉంది. ఈ మార్గం ద్వారా నిత్యం ప్రముఖ విద్యా సంస్థలకు చెందిన పాఠశాలకు విద్యార్థులు, వారి తల్లితండ్రులు సంచరిస్తూ ఉంటారు. రోగులు కూడా వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చిన వారు ఎక్కువగా ఈ చుట్టు ప్రక్కల ఉన్న ఆసుపత్రులకు వచ్చి పోతూ ఉంటారు. ఏ క్షణంలోనైనా కూలిపోయే స్థితిలో ఉన్న భవనం పొరపాటున కూలితే పెద్ద ప్రమాదమే జరిగే అవకాశం లేకపోలేదు. మున్సిపల్‌ అధికారులు రాబోవు ప్రమాదాన్ని ముందుగా గుర్తించి ప్రాణహాని జరగకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.