Apr 05,2022 06:34

ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు కూల్‌డ్రింక్స్‌ షాపుల వైపు పరుగెడతారు. ఇంట్లో రిఫ్రిజిరేటర్లలో కూల్‌ డ్రింక్స్‌ సీసాలు నిల్వ చేసుకునే వారూ వున్నారు. వాస్తవానికి కూల్‌డ్రింక్స్‌ చల్లదనాన్ని ఇవ్వవు. ఇవ్వకపోగా మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని అనేక పరిశోధనలలో తేలింది. మన శరీరంలో జరిగే మార్పును గ్రహించకుండా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన అలవాట్లను మనిషి నేర్చుకున్నాడు. ముఖ్యంగా ఈ కూల్‌ డ్రింక్స్‌కు బాగా అలవాటు పడ్డారు. వీటిలో పురుగుల మందుల అవశేషాలు పుష్కలంగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌-ఇండియా దశాబ్ద క్రితమే తేల్చి చెప్పింది. మానవ శరీరాలకు ప్రమాద కారకంగా మారే కార్బొనేటేడ్‌ వాటర్‌, కార్న్‌ సిరప్‌, పంచదార, కారమెల్‌, పాస్ఫరిక్‌ ఆమ్లం, కెఫిన్‌, సిట్రిక్‌ ఆమ్లం, పొటాషియం బెంజైట్‌, పొటాషియం సిట్రేట్‌ వంటి పదార్థాలు కూల్‌ డ్రింక్స్‌లో ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కూల్‌ డ్రింక్స్‌లో ఆర్గానో క్లోరిన్‌, ఆర్గానో ఫాస్ఫరస్‌, పురుగుల మందులైన లిండేన్‌, డిడిటి, మలాథియాన్‌ ఉన్నట్లు పరిశోధనలు చెపుతున్నా... ప్రభుత్వాలు వీటిని నిషేధించడం లేదు.

    ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కూల్‌ డ్రింక్స్‌ కంపెనీలు ఏటా ఏడు వేల కోట్లు దోచుకుంటున్నాయి. హీరోలుగా, క్రీడాకారులుగా, అవార్డు గ్రహీతలు, పెద్దమనుషులుగా చలామణి అవుతున్నవారు కోట్లల్లో డబ్బు తీసుకుని ప్రజారోగ్యాన్ని నిర్వీర్యం చేసే వాణిజ్య ప్రకటనలు ఇస్తున్నారు. కూల్‌ డ్రింక్స్‌లో పిహెచ్‌ శాతం టాయిలెట్‌ క్లీనర్ల యాసిడ్‌తో సమానంగా ఉంటుంది. ఇది శరీరానికి చాలా ప్రమాదకరం. స్థూలకాయం, ఊపిరి తిత్తులు బలహీనపడడం, బి.పి, షుగర్‌, ఎముకల మెత్తబడి పోవడం, కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్యవస్థను ధ్వంసం చేస్తుంది. గర్భిణీలు కూల్‌డ్రింక్స్‌ సేవిస్తే పుట్టబోయే పిల్లలు-పిండంపై ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, కిడ్నీ, లివర్‌, క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
     వేసవిలో మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలు, రాగి జావ, తాటి ముంజలు, కర్బుజా, కళింగర, కీర దోస పిల్లలకు అలవాటు చేస్తే మంచిది. మంచి ఆరోగ్యపు అలవాట్లు ఇంటి నుండే ప్రారంభం కావాలి. పెళ్లిళ్లలో, శుభకార్యాలలో ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల కూల్‌ డ్రింకులను నిలుపుదల చేయాలి. ప్రభుత్వం దీనిని నిషేధించే వరకు ప్రజలు, పౌర సంఘాలు ఉద్యమించాలి. స్వలాభం కోసం వాణిజ్య ప్రకటనలు ఇచ్చే హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులను ప్రశ్నించండి.
     మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేస్తే శవం పూర్తిగా కాలిపోతుంది. ఎముకలు పూర్తిగా కాలిపోతాయి. కానీ నోటి లోని పళ్లు మాత్రం కాలిపోవు. శవాన్ని కాల్చడానికి బదులుగా భూమిలో పాతిపెడితే శరీరం మొత్తం మట్టిలో కలిసి పోతుంది. 20 సంవత్సరాల తర్వాత ఆ మట్టి భాగాన్ని తవ్వి తీస్తే పళ్లు మాత్రం చెక్కు చెదరకుండా ఉంటాయి. ఇంత గట్టిగా మన పళ్లు తయారు చేయబడ్డాయి. ఏ పళ్లనైతే అగ్ని కాల్చలేక పోయిందో, ఏ పళ్లనైతే మట్టి తనలో కరిగించుకోలేక పోయిందో, అవే పళ్లను 20 రోజుల పాటు ఏదైనా ఒక కూల్‌డ్రింక్‌లో ఉంచి పరిశీలిస్తే అవి పూర్తిగా కరిగిపోతున్నాయి. ఆ పళ్లు రంగు మారి నొక్కితే పిండిగా అయిపోతున్నాయి. ఒక కూల్‌డ్రింకులో ఒక పన్ను వేసి 8వ రోజు చూసేసరికి ఆ పన్ను పూర్తిగా కరిగిపోయి మాయమైంది. మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపులో 50 టన్నుల ఆహారాన్నయినా ఈ పళ్లతో నములుతాం. అన్ని టన్నుల ఆహారాన్ని నమిలినా అరగని పళ్లను...ఒక కూల్‌డ్రింక్‌ నెల తిరగకుండా కరిగించేస్తున్నదంటే అవి తాగే డ్రింకులా లేక విషపదార్ధాలా? విషపదార్థాలే, కాకపోతే ఎక్కువగా నీటి శాతం ఉండబట్టి మెల్లగా చంపే విషంలా పనిచేస్తాయి. అలాంటి గట్టి పళ్లనే నాశనం చేసే డ్రింక్స్‌కి మన లోపలి పేగులు, నరాలు, కణాలు ఒక లెక్కా ఏమిటి ?
 

- డాక్టర్‌ యం. సురేష్‌ బాబు