ప్రజాశక్తి-గంపలగూడెం
గత నాలుగేళ్లుగా దెబ్బతిని కునారిల్లుతున్న గంపలగూడెం కట్టలేరు వంతెన పూర్తిగా కుప్పకూలింది. గత పది రోజులుగా పడుతున్న నిరంతర వర్షాలతో వచ్చిన వరద ఉధతికి ఉన్న కాస్త పట్టు సడలింది. దీనితో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల చెందిన దాదాపు100 గ్రామాల ప్రజల రాకపోకలకు అనూహ్యంగా బ్రేక్ పడింది. బ్రిడ్జికి ఉన్న రెండు కానాలు కూడా కుప్పకూలాయి. గత వారం రోజులుగా వంతెనకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచాయి. దీనితో గంపలగూడెం - తోట మూలలో ఉన్న వ్యాపారాలు పూర్తిగా సన్నగిల్లినట్లు వ్యాపారస్తులు సైతం బాధపడుతున్న పరిస్థితి నెలకొంది. ఇకనుండి కేవలం వ్యక్తులు మాత్రమే కాలినడకన తప్ప కనీసం ద్విచక్ర వాహనంపై కూడా ప్రయాణం చేసే అవకాశాలు లేవని రోడ్లు భవనాల శాఖ అధికారులు ధ్రువీకవీకరించినట్లు సమాచారం. దీనితో స్థానిక తహసిల్దార్ జి బాలకష్ణారెడ్డి ఆదేశాలతో స్థానిక పోలీస్ అధికారి వి సతీష్ వంతెనకు ఇరువైపులా తన సిబ్బందితో ప్రొటెక్ట్ చేశారు. ఈ పరిస్థితుల్లో ప్రజల ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు వచ్చాయి. ఎంతో రద్దీగా ఉండే ఈ వంతెన మరమ్మత్తులు త్వరితగతిన చేపట్టి కనీస రాకపోకులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుచున్నారు.
10 రోజుల్లో మరమత్తులు చేపడతాం : తహసిల్దార్
వంతెనపై వాహనాల రాకపోకలు జరపడం సాధ్యం కాదని స్థానిక తహసిల్దార్ జి బాలకష్ణారెడ్డి తెలిపారు. పది రోజుల్లో వంతెన శిథిలాలను తొలగించి బలమైన తూరలు ఏర్పాటు చేస్తామని, అప్పటివరకు ప్రమాద భరితంగా ఉన్న ఈ వంతెనపై రాకపోకలు పూర్తిగా నిలిపివేస్తున్నట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ విషయమై తగిన జాగ్రత్తల్లో భాగంగా అవసరమైన చర్యలు స్థానిక ఎస్సై వి సతీష్ తీసుకుంటున్నట్లు వివరించారు.










