చిత్తూరు : కత్తి మహేష్ మృతిపై ఎంఆర్‌పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ సంచలన ఆరోపణలు చేశారు. రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందిన కత్తి మహేష్ మరణంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కత్తిమహేష్ అంత్యక్రియలకి హాజరైన అనంతరం మందకృష్ణ చిత్తూరు జిల్లా యల్లమందలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... కారులో ముందు కూర్చున్న కత్తి మహేష్ చనిపోతే పక్కనే ఉన్న వ్యక్తికి చిన్న గాయం లేకుండా ఎలా బతికారని ప్రశ్నించారు. కత్తి మహేష్‌కు చాలామంది శత్రువులున్నారని చెప్పారు. కారు కూడా కత్తిమహేష్ కూర్చున్న వైపే డ్యామేజ్ కావడం అనుమానాలకి తావిస్తోందన్నారు. మొదట కత్తి మహేష్ కు అసలు గాయలే లేవన్నారు. కత్తిమహేష్ మరణం తర్వాత సోషల్ మీడియాలో అతని గురించి దారుణంగా కామెంట్స్ చేశారని మందకృష్ణ తెలిపారు. ''కత్తి మహేష్ మరణంపై నిజాయితీగల ఉన్నతాధికారులు, లేదంటే సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలి. రెండు.. 15 రోజులు జరిగిన ట్రీట్‌మెంట్ ఏంటన్నది ఆస్పత్రుల నుంచి బయటకు రావాలి. ఇక ప్రమాదం జరిగిందా.. మరణం వెనుక మిస్టరీ ఉందాన్నది నిగ్గుతేలాలి.'' అని మందకృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు.










