ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ : క్షయ వ్యాధి నివారణపై విస్తృత స్థాయి అవగాహన కల్పించాలని, పూర్తిగా వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లో ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధి 2030 కి పూర్తిగా నిర్మూలించడానికి అందరూ కృషి చేయాలన్నారు. రెండు వారాలుగా దగ్గు, జ్వరం వస్తే ఆరోగ్య కేంద్రంలో సంప్రదించాలన్నారు. వెంటనే చికిత్స పొందితే నెల రోజుల్లోనే వ్యాధిని అదుపు చేయవచ్చన్నారు. క్షయ వ్యాధి లక్షణాలు వివరించి ఆ వ్యాధిని అరికట్టడానికి క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటికి వైద్య సిబ్బంది వెళ్లి వ్యాధిగ్రస్తులను గుర్తించి వెంటనే చికిత్స అందించాలన్నారు. జిల్లాలో గుర్తించిన సుమారు 1400 మంది వ్యాధి బాధితులకు ప్రతినెల రేషన్ సరఫరాతో పాటు పోషకాహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోషకాహారం తీసుకుంటూ చికిత్స తీసుకుంటే వ్యాధిని అరికట్ట వచ్చున్నారు. జిల్లాలో విశ్వనాథ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 114 టీబీ బాధితులను దత్తత తీసుకున్నారన్నారు. జిల్లాలో ఇతర స్వచ్ఛంద సంస్థలు బాధితులను దత్తత తీసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. క్షయ వ్యాధి వల్ల ఆందోళన వద్దని సరైన చికిత్స పొందుతే అరికట్టవచ్చని అన్నారు. అనంతరం క్షయ వ్యాధి నిర్మూలన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. విశిష్ట సేవలు అందించిన వైద్య సిబ్బందికి కలెక్టరు ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, ఎంపిడిఒ అశోక్ కుమార్ రెడ్డి, డాక్టర్ సెల్వ సల్మాన్, డాక్టర్ తిప్పయ్య, డాక్టర్ కేసి కుల్లాయప్ప, డాక్టర్ తిప్పేంద్ర నాయక్, డాక్టర్ నాగరాజు నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.










