వ్యవసాయ నల్ల చట్టాల రద్దు చేస్తామని ప్రకటిస్తూ ప్రధాని మోడీ దేశ ప్రజలకు చెప్పిన క్షమాపణలకు చిత్తశుద్ధి లేదని మరోసారి తేటతెల్లమైంది. రైతు ఉద్యమ ధాటికి తట్టుకోలేక, ఓ ఏడాదిలోగా జరగనున్న ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కంటి తుడుపుగా చెప్పిన క్షమాపణని స్పష్టమవుతోంది. ఉత్తర ప్రదేశ్‌లో రైతులను హత్య చేయడానికి పక్కా ప్రణాళికతోనే కుట్ర చేశారనీ, అందులో భాగంగానే లఖింపూర్ ఖేరీ ఘటన జరిగిందని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక స్పష్టం చేసింది. అక్టోబరు 3న అజరు మిశ్రాకు చెందిన కాన్వారు లఖింపూర్ ఖేరీలో రైతుల ప్రదర్శనపైకి దూసుకెళ్లింది. నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు ఆ రోజునే మరణించారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ మారణకాండ వెనుక కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాతో పాటు మరో 12 మంది ఉన్నారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పోలీసు సిట్ తన నివేదికను కోర్టుకు సమర్పించింది. హత్యాయత్నానికి పాల్పడిన అభియోగాల కింద శిక్షించేలా 13 మంది నిందితులపై కొత్త సెక్షన్లను చేర్చాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టుకు సిట్ దరఖాస్తును దాఖలు చేసింది. హంతకులకు వత్తాసుగావున్న కేంద్ర మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీలు పట్టుబడితే అది 'సబ్‌జ్యూడిస్' అవుతుందని బిజెపి నేతలు బుకాయించడం దారుణం. కన్నంలో దొంగలా దొరికిన అమాత్యుడ్ని రక్షించేందుకు అధికారపక్షం తన మందబలంతో సభను వాయిదాలు వేసుకుపోయిందే తప్ప పార్లమెంటుకు విలువనివ్వలేదు.
లఖింపూర్ ఘటన ఒక ప్రమాదమని అటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వమూ బుకాయించడానికి తొలుత ప్రయత్నించాయి. వీడియోల్లో సాక్ష్యాధారాలు లభించడం, రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడంతో బిజెపి నేతల ఆటలు సాగలేదు. సర్వోన్నత న్యాయస్థానానికి ఆ కేసు చేరడం విచారణ అనంతరం సిట్ ను నియమించాలని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. యుపి సర్కారు సిట్ ను నియమించింది కానీ దర్యాప్తు మాత్రం ముందుకు సాగలేదు. నత్త నడకపై యుపి సర్కార్‌ను ధర్మాసనం మందలించిన తరువాత ఇప్పటికి సిట్ నివేదిక వచ్చింది. ఆలస్యంగానైనా సిట్ నివేదిక ఘటనలో మంత్రి తనయుడి రాక్షసత్వాన్ని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ఆ నివేదిక గురించి ప్రశ్నించిన మీడియా ప్రతినిధులపై మంత్రి అజరు మిశ్రా వీరంగం వేయడం బరితెగింపునకు నిదర్శనం.
ప్రజా ఉద్యమాలను హింసాత్మకంగా అణచివేయాలన్నది ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి విధానంగా కనిపిస్తోంది. అందుకు ఒకవైపు పోలీసులను ప్రయోగించడం మరోవైపు ఉద్యమకారులను రెచ్చగొట్టడం, ఇంకోవైపున నకిలీలను సృష్టించడం లేదా చొప్పించడం వంటి దుర్మార్గాలకు కమలనాథులు పాల్పడుతుంటారు. నల్ల చట్టాల రద్దు, మద్దతు ధరలకు చట్టబద్ధత కోరుతూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే రహదారులపై బ్యారికేడ్లు పెట్టించింది ప్రభుత్వమే. రోడ్లపై భారీ మేకులను కొట్టించింది కేంద్ర హోం శాఖ పరిధి లోని ఢిల్లీ పోలీసులే కదా! రైతు ఉద్యమం ఉధృతమవుతున్న సమయంలో రిపబ్లిక్ డే పెరేడ్ సందర్భంగా అరాచకాన్ని సృష్టించింది కాషాయ మూకలే. హింస చెలరేగిపోతోందని నానా యాగీ చేసిందీ వారే. అంతకుముందు సిఎఎ వ్యతిరేక ఆందోళనలను రక్తసిక్తం చేసిన పోలీసులు అమాయకులపై యుఎపిఎ చట్టం కింద తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించారు. అసోంలో కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ప్రజలను ముఖ్యంగా మైనార్టీలను హింసించారు. జెఎన్‌యు, జామియా మిల్లియా క్యాంపస్‌లలోకి చొరబడి విద్యార్థులను చితకబాదిన ఢిల్లీ పోలీసులు తిరిగి వారిపైనే దేశద్రోహ నేరం మోపారు. బిజెపి పాలనలో సాగుతున్న ఇలాంటి అకృత్యాలకు విశాల ప్రజా మద్దతుతో శాంతియుతంగా సాగిన రైతు ఉద్యమం ఒక విధంగా అడ్డుకట్ట వేసింది. ఆ ఉద్యమోధృతికి తట్టుకోలేకనే మొండి వాడని చెప్పబడే మోడీ ప్రజలకు క్షమాపణ చెప్పవలసి వచ్చింది. ఇప్పటికైనా మంత్రి అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేస్తేనే ఆ క్షమాపణకు కొంచెమైనా విలువ ఉంటుంది. లేకపోతే అదీ ఓ నాటకంగా మిగిలిపోతుంది. ఆ నాటకాలకు తెర పడక తప్పదు.










