అటు ఆర్థిక సంక్షోభం, మరోవైపున కరోనా విపత్తు మూలంగా దేశంలో ఉపాధి అవకాశాలు క్షీణిస్తున్నా ఢిల్లీ గద్దెనెక్కిన పెద్దలు ఉద్యోగ కల్పనపై ఊదర గొడుతూనే వున్నారు. కాని, వారివి ఒట్టి మాటలేనని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ గణాంక శాఖ విడుదల చేసిన నియమిత కాల శ్రామిక శక్తి సర్వే (పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే- పిఎల్‌ఎఫ్‌ఎస్) తేల్చి చెప్పింది. 2017 ఏప్రిల్ నుండి ప్రతి మూడు నెలలకోసారి పిఎల్‌ఎఫ్‌ఎస్ నిర్వహించి నివేదిక విడుదల చేస్తున్నారు. కరోనా మొదటి దశలో ముఖ్యంగా 2020 మార్చి 28 నుండి అమలు చేసిన 68 రోజుల లాక్‌డౌన్ సమయంలో నిరుద్యోగ భూతం ఎంతలా దేశాన్ని ఆవరించిందో నివేదిక తేటతెల్లం చేసింది. 2019 ఏప్రిల్ జూన్ మధ్య 8.9 శాతంగా ఉన్న పట్టణ ప్రాంత నిరుద్యోగిత 2020 అదే కాలంలో 20.9 శాతానికి పెరిగింది. అంటే రెట్టింపయింది. ఇటీవల విడుదల చేసిన నివేదిక వెల్లడించిన గ్రామీణ ఉపాధి వివరాలు పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత మరింత స్పష్టమవుతుంది. పైన పేర్కొన్న మూడు నెలల కాలంలో ఒక కోటి 10 లక్షల మంది పట్టణవాసులు ఉపాధి కోల్పోగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక కోటి 14 లక్షల మంది కొత్తగా ఉపాధి పొందారు. వ్యవసాయ రంగంలో ఉపాధి లభించిన రోజుల సంఖ్య పెరిగినట్టు కనిపించినా పని గంటలు తగ్గిపోవడం, సగటు వేతనం దిగజారడం గురించి కూడా నివేదిక పేర్కొంది. మొత్తంగా చూస్తే శ్రామిక మార్కెట్ అన్ని వైపుల నుండి తీవ్ర ఒత్తిడికి గురయ్యిందన్నది వాస్తవం.
ఇదిలా వుండగా, 2019 జులై నుండి 2020 జూన్ వరకు ఏడాది వివరాలు చూస్తే దేశవ్యాపిత నిరుద్యోగిత రేటు 5.8 శాతం నుండి 4.8 శాతానికి తగ్గినట్టు పేర్కొనడం విస్తుగొలుపుతుంది. అయితే, కీలకమైన లాక్‌డౌన్ సమయంలో ఉపాధి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎంతలా క్షీణించిందో చివరి త్రైమాసిక వివరాలు తేటతెల్లం చేశాయి. అధిక ఆదాయ అవకాశాలున్న పట్టణ ఉపాధి పోయి, తక్కువ ప్రతిఫలం దక్కే గ్రామీణ ఉపాధి కొద్దిగా ఎక్కువ లభించినా ప్రయోజనం ఉండదు. ఉదాహరణకు దేశ వ్యవసాయ రంగంలో శ్రామికుని తలసరి ఉత్పత్తి విలువ 2018-19లో రూ.1.18 లక్షలు కాగా అది 2019-20లో రూ.1.02 లక్షలకు పడిపోయింది. గ్రామీణ ఉపాధి హామీ పనుల్లో వేతనాలు కూడా ఈ కాలంలో ఘోరంగా తగ్గిపోయిన విషయం అందరికీ తెలిసిందే! ప్రజల ఆదాయాలు తీవ్రంగా తగ్గిపోయిన నేపథ్యంలో మాంద్యం నెలకొనడం, పర్యవసానంగా శ్రామికులకు మరింతగా ఉపాధి తగ్గిపోవడం జరుగుతోంది. కనుక ఉపాధి అవకాశాలను పెంచడం నేటి ప్రథమ కర్తవ్యం. అయితే, మాంద్యం వల్ల పారిశ్రామికోత్పత్తుల నిల్వలు పేరుకుపోయాయి. అవి ఉండగా పరిశ్రమాధిపతులు కొత్తగా ఉత్పత్తి చేపట్టరు. ఈ విష వలయం నుండి బయట పడడానికి ప్రజల కొనుగోలు శక్తి పెంచడం తక్షణ మార్గం. అందుకు తగిన విధంగా సహాయ ప్యాకేజిని ప్రభుత్వం ఇవ్వాలి. కాని కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఏమీ చెయ్యకుండా (ఆత్మ నిర్భర్) ప్యాకేజి పేరిట దేశ విదేశీ కార్పొరేట్లకు దోచిపెట్టడం దారుణం. ప్రజా జీవనం, ఉత్పత్తి కార్యకలాపాలు సాగడానికి శ్రామికులు ఎటు కావాలంటే అటు క్షేమంగా వెళ్లి తిరిగి వచ్చేందుకు అవకాశం ఉండాలి. అలాంటి పరిస్థితి ఏర్పడాలంటే అందరికీ వ్యాక్సినేషన్ జరగాలి. తద్వారా కరోనా మహమ్మారిని కట్టడి చేయడమూ సాధ్యమవుతుంది. కాని, కేంద్ర ప్రభుత్వం టీకా సరఫరాలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికైనా దేశీయ టీకా ఉత్పత్తి సామర్ధ్య పెంపుదలకు చర్యలు చేపట్టి ఈలోగా అవసరమైన మేరకు విదేశాలనుండి దిగుమతి చేసుకోవాలి. వయోజనులందరికీ సార్వత్రిక ఉచిత టీకా అందజేయాలి.
నిరుద్యోగ భూతం ఇంతలా వెంటాడుతున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ యువతీ యువకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో రిక్రూట్‌మెంట్ జరిపే డిఎస్‌సి, గ్రూప్స్, పోలీసు ఉద్యోగాల ఊసెత్తకపోవడంతో ఆగ్రహం పెల్లుబికి ఆందోళనలకు పూనుకుంటున్నారు. యువ శక్తికి తగిన పని కల్పించడం ద్వారానే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందన్న వాస్తవాన్ని ఏలినవారు గ్రహించడం ఎంతో అవసరం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించి సవరించిన జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై శ్రద్ధ వహించాలి.










