- పెండింగ్‌లో ఉన్న రాయితీ బకాయిలు విడుదల చేయాలి
- కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విజ్ఞప్తి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం నిల్వ కోసం 'రైస్ సైలోస్' నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న రాయితీ బకాయిలు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడిక్కడ జరిగిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పౌర సరఫరాల మంత్రుల జాతీయ సదస్సులో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పాల్గనాురు. అనంతరం కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రేషన్ కార్డుదారులకు నాణ్యమైన పౌర సరఫరాలలో ఎదురైన సవాళ్ల గురించి సమావేశంలో చర్చించామన్నారు. 2012-18 కాలానికి సంబంధించి కేంద్రం నుండి రావలసిన బియ్యం సబ్సిడీ క్లెయిమ్ పై కేంద్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పియూష్ గోయల్ హామీ ఇచ్చారని తెలిపారు. బియ్యానికి ప్రత్యామాుయంగా రాయలసీమ జిల్లాల్లో రాగులు, ఉత్తరాంధ్రలో జనులు సరఫరా చేస్తున్నామని, డిమాండు మేరకువాటి సేకరణకు ఎఫ్‌సిఐకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరామన్నారు. కందుల సరఫరాకు సంబంధించి ఎఫ్‌సిఐ నుండి రావలసిన 50,000 మెట్రిక్ టన్నులలో కొంతే వచ్చిందని, రావల్సినదాని గురించి మాట్లాడడం జరిగిందని అన్నారు. గోడౌన్లు లేనిచోట బియ్యం నిల్వ కోసం పైలట్ ప్రాజెక్టు కింద 'రైస్ సైలోస్' ల నిర్మాణం బీహార్ లో చేపట్టదల్చారని, దేశ బియ్యపు భాండారంగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద 'రైస్ సైలోస్' ల నిర్మాణం చేపట్టాల్సిన అవసరముందని తెలిపామన్నారు.










