Jul 09,2021 20:32
పులిచింతల ప్రాజెక్టుకు చేరిన నీరు

*  రికార్డు స్థాయిలో 40.59 టిఎంసిలు నిల్వ
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :
పులిచింతల ప్రాజెక్టుకు శుక్రవారం సాయంత్రం భారీగా వరద నీరు చేరింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 45.70 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 40.59 టిఎంసిలు ఉంది. ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 42 టిసిఎంలకు చేరితే క్రస్ట్‌ గేట్లన్నీ ఎత్తి నీరు దిగువకు విడుదల చేయాల్సి వస్తుంది. నాగార్జునసాగర్‌ జలాశయం వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తితో 32,026 క్యూసెక్కులు వస్తుండగా, 10,229 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో, కృష్ణా పరివాహక ప్రాంతానికి వరద ముప్పు పొంచి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు గుంటూరు, కృష్ణా జిల్లాల అధికారులకు, తెలంగాణలోని సూర్యాపేట జిల్లా అధికారులకు పులిచింతల ప్రాజెక్టు ఎస్‌ఇ రమేష్‌బాబు సమాచారం ఇచ్చారు. జులైలో పులిచింతల ప్రాజెక్టులో 40 టిఎంసిలు పైబడి నీరు రావడం ఇదే తొలిసారి. ఎగువ నుంచి భారీ వర్షాలు, వరదలు లేకుండానే సాగర్‌ వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేయడం వల్ల పులిచింతలకు భారీగా నీరు చేరుతోంది. పులిచింతల వద్ద కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి కొనసాగిస్తుండడంతో ప్రాజెక్ట్‌కు నీటి ఉధృతి పెరిగింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి, కృష్ణా జిల్లాలోని వివిధ మండలాల నుంచి ప్రకాశం బ్యారేజీకి 11,624 క్యూసెక్కుల నీరు వస్తోంది. 8,821 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో కాల్వలకు దాదాపు మూడు వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.