Dec 01,2020 07:17

పాత కష్టమే 'నివర్‌'గా కొత్త
పేరెట్టుకొని వరి కళ్ళాల్లో కురిసి
కర్షకుడి కళ్ళల్లో కన్నీరై నిలిచి..
అతడి కష్టాన్ని గాల్లో దీపంలా
ఆర్పేసింది..! పంటలన్నీ
ప్రకృతి ప్రకోపానికి తడిసి
మోపెడు దు:ఖంగా మారాయి
గాలీ వర్షానికి తలలు
వాల్చేసిన పచ్చటి పొలాల్ని..
నీట ములిగిన వరిపనల్ని
ధాన్యపు రాశుల్ని నిస్సహాయంగా
తడుముతూ చేతనయిన
శశ్రూషలన్నీ చేస్తున్నాడు రైతు
మట్టి లోంచి మాణిక్యాల్ని వెలికి
తీసే అపరబ్రహ్మకి..
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న
కంకుల్ని బతికించడమూ తెల్సు
సరిహద్దుల్లో సైనికుడిలా.. తనపై
విరుచుకుపడే ప్రకృతి వైపరీత్యాలకు
ఎదురు నిల్చి గెల్చి ..తను తిన్నా
తినకపోయినా నమ్ముకొన్న నోళ్లకు
పట్టెడన్నం పెట్టి ఆదుకోడమూ తెల్సు!
కనుకనే అతడ్ని 'అన్నదాత' అని
సగౌరవంగా పిల్చుకొంటున్నాం..!!
 

- భీమవరపు పురుషోత్తం,
సెల్‌ : 9498 00253