Nov 02,2021 06:31

'గామ స్థాయిలో ప్రజలు ఇంటి దగ్గర ఉండి ఏదైతే కోరుకున్నారో, డా.అవులప్ప, అతని బృందం అదే చేశారు. ఆసుపత్రులకు వెళ్ళేందుకు గ్రామస్థులు భయపడిన సమయంలో వారు ప్రజలకు సేవలందించారు. కోవిడ్‌-19ను నియంత్రించ డంలో వారి సేవల ప్రభావం చాలా ఉంది'

బెంగళూరుకు వంద కీ.మీ దూరంలో ఉన్న బాగేపల్లి, గుదిబండ తాలూకాలకు చెందిన గ్రామాల ప్రజలు కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు డా.అనిల్‌ కుమార్‌ అవులప్ప 480 మంది వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. బాగేపల్లిలో అవులప్పకు 30 పడకల ప్రజా వైద్యశాల ఉంది. కర్నాటక రాష్ట్రానికి వెనుక భాగంలో ఉన్న కరువు ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన మెజారిటీ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వ్యవసాయ కార్మికులు.
   కరోనాను అదుపు చేసేందుకు డా.అవులప్ప అనుసరించిన సాధారణ పద్ధతులు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో తెలుసుకునేందుకు 'ఫ్రంట్‌లైన్‌' బాగేపల్లి తాలూకా పరిధిలోని నరిమద్దిపల్లి, సోమనాథపుర గ్రామ పంచాయతీ పరిధిలోని 7 గ్రామాలను సందర్శించింది. ప్రయివేట్‌, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో సరైన సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కరోనాను అదుపు చేసేందుకుగాను డా.అవులప్ప వాలంటీర్లకు శిక్షణ ఇచ్చారు. బాగేపల్లి తాలూకాలో ప్రతీ రెండు పంచాయతీలకు కేవలం ఒకే ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటుంది. ఈ ఏడు గ్రామాల్లోని వాలంటీర్లు కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు డా.అవులప్ప సలహా ప్రకారం ఏ విధమైన వైద్య సేవలను అందించారో తెలిపారు.
గత సంవత్సరం కోవిడ్‌-19 పట్టణ, నగర ప్రాంతాలు దాటి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించినప్పుడు, డా.అవులప్ప వాలంటీర్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో చొరవ చూపారు. బాగేపల్లి తాలూకాలోని గ్రామాలకు ఈ మహమ్మారి వ్యాపించినట్టయితే చాలా ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని ఆయన తెలుసుకున్నాడు. డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ కూడా అయిన ఈ డాక్టర్‌, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) అనుబంధ సంఘాలైన డివైఎఫ్‌ఐ, ఐద్వా, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలకు చెందిన వాలంటీర్‌ దళాలను బాగేపల్లి, గుదిబండ తాలూకాలలో ఒకచోటకు చేర్చారు. ఆ ప్రాంతంలో సిపిఐ(ఎం) సుదీర్ఘమైన పోరాట చరిత్రను కలిగి ఉండడం ఆయన చొరవ చేసి మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి చాలా సహాయపడింది. వెంటనే మూడు నుంచి ఐదుగురు వాలంటీర్లున్న బృందాలను160 గ్రామాలలో (గ్రామానికి ఒక బందం చొప్పున) అందుబాటులో ఉంచారు.
    కోవిడ్‌-19 లక్షణాలు, దాని నివారణా చర్యలను వివరిస్తూ, వాలంటీర్లకు పద్నాలుగు శిక్షణా సమావేశాలను నిర్వహించారు డా.అవులప్ప. కరోనా మహమ్మారి మొదటి దశ వ్యాప్తి సమయంలో, వ్యవసాయ కార్మికులలో వివిధ జబ్బులతో బాధపడుతున్న వారిని గుర్తించి, వారికి వైద్య సేవలు అందించడానికి తన విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించారు.
    ''కరోనా మొదటి దశలో వృద్ధులు, అనారోగ్యంతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతూ, ప్రమాదపుటంచున ఉన్న బలహీన వర్గాల ప్రజలపై కేంద్రీకరించాం. కానీ వైరస్‌ వల్ల కలిగే ప్రమాదాల పట్ల సామాన్య ప్రజానీకంలో భయంకరమైన ఉదాసీనత ఉండేది. కరోనా రెండవ దశ వ్యాప్తిలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరుగుతుండడంతో గ్రామాలలో ప్రజలు అకస్మాత్తుగా భయాందోళనలకు గురై వాలంటీర్ల సహాయాన్ని కోరారు. ఆ సమయంలో నేను, దక్షిణాఫ్రికాలో భారతీయ సంతతికి చెందిన డాక్టర్‌ శంకర్‌ చెట్టి అనుసరించిన పద్ధతుల గురించి విన్నాన''ని అవులప్ప చెప్పారు.
   చెట్టి విధానాన్ని అనుసరిస్తూ, అవులప్ప తన బృందాలకు వైద్యానికి సంబంధించిన నియమ నిబంధనలను తెలియజేస్తూ ముందుకు సాగారు. రెండు ప్రభుత్వేతర సంస్థలు, ద రోటరీ బెంగళూర్‌ స్పందన అండ్‌ ద రైట్‌ టు లివ్‌ ఫౌండేషన్‌ (ఆర్టీఎల్‌ఎఫ్‌)లు థర్మల్‌ స్కానర్లు, పల్స్‌ ఆక్సీ మీటర్లు, మందులను సమకూర్చి సహాయం చేశాయి. అవులప్ప అనుసరించిన విధానం పూర్తిగా ప్రత్యేకమైనది. గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ ప్రజాస్వామికంగాను ఉంది కాబట్టి మా సంస్థ అవులప్పకు సహాయం అందించడానికి చాలా ఆత్రుతగా ఎదురు చూస్తుందని ఆర్టీఎల్‌ఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టి.వి. శ్రీధర్‌ ఫ్రంట్‌లైన్‌తో చెప్పారు. ఆ విధంగా ప్రతీ గ్రామీణ కేంద్రంలో (వాలంటీర్‌ ఇంట్లో) కోవిడ్‌ లక్షణాల పర్యవేక్షణకు అవసరమైన అన్ని పరికరాలు అందుబాటులో ఉండేవి. ఏప్రిల్‌ నెలలో కర్నాటకలో కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో, అవులప్ప ఆసుపత్రి కోవిడ్‌ రోగులతో నిండి పోయేది. కానీ వీడియో కాన్ఫరెన్సుల ద్వారా ఆయన వాలంటీర్ల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసేవారు. కోవిడ్‌ లక్షణాలు ఏ మాత్రం తగ్గని రోగులతో కూడా ఫోన్‌ ద్వారా మాట్లాడే అవకాశం కల్పించారు.
    ''గ్రామ స్థాయిలో ప్రజలు ఇంటి దగ్గర ఉండి ఏదైతే కోరుకున్నారో, డా.అవులప్ప, అతని బృందం అదే చేశారు. ఆసుపత్రులకు వెళ్ళేందుకు గ్రామస్థులు భయపడిన సమయంలో వారు ప్రజలకు సేవలందించారు. కోవిడ్‌-19ను నియంత్రించడంలో వారి సేవల ప్రభావం చాలా ఉందని'' బాగేపల్లి తాలూకా ఆరోగ్య అధికారి డా. సిఎన్‌ సత్యనారాయణ రెడ్డి అన్నారు.
     ''మే మొదటి వారం నుంచి జూన్‌ 15 వరకు, 1288 మందికి మొదటి డోస్‌ మందుల ద్వారా వైద్యం చేశారు. వారిలో ఎక్కువ మందికి మూడు, నాలుగు రోజుల తరువాత కోవిడ్‌ లక్షణాలు పూర్తిగా లేకుండా పోయాయి. కేవలం 43 మందికి మాత్రమే రెండో డోస్‌ మందుల అవసరం ఏర్పడింది, కానీ వైరస్‌ సోకి చనిపోయిన వారెవ్వరూ లేరు, ఏ ఒక్కరూ ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడలేద''ని హరీషా చెప్పింది. వాలంటీర్ల నుండి వివిధ గణాంక వివరాలను సేకరించే బాధ్యతను తీసుకున్నారీమె. కోవిడ్‌ నియంత్రణకు చేపట్టిన చర్యలను ఈ గణాంకాల ద్వారా అంచనా వేయవచ్చు.
     ''గ్రామీణ భారతంలో ఆరోగ్య సంరక్షణా సేవలు భారీగా విస్తరించినప్పుడు మాత్రమే కరోనా మూడో దశ వ్యాప్తిని నిలువరించగలం. 1918-1920 మధ్య కాలంలో స్పానిష్‌ ఫ్లూ వ్యాప్తి చెందిన తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థలలో మార్పు వచ్చింది. రష్యాలో ఆరోగ్య సేవలను ఉచితంగా అందించారు. బ్రిటన్‌లో జాతీయ ఆరోగ్య సేవల స్థాపనకు దారితీసింది. కరోనా మహమ్మారి అంతం అయిన తరువాత, కార్పొరేట్‌ ఆరోగ్య సంరక్షణా వ్యవస్థను వదిలించుకొని, భారతదేశం ప్రజారోగ్య సంరక్షణా వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేయాల''ని అవులప్ప అంటున్నారు.

('ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో)

వికార్‌ అహమ్మద్‌ సయీద్‌