పారిస్: కోవిడ్‌ా19 మహమ్మారితో ప్రపంచ ఆర్థిక, సామాజిక పరిస్థితులు అతలాకుతలమయ్యాయి. కరోనా ప్రభావం నుంచి ప్రపంచం కోలుకుంటుందన్న సమయంలో వైరస్ మార్పులు చెందుతూ కొత్త వేరియంట్‌ల రూపంలో అదేవిధమైన ప్రమాదం ముంచుకొస్తోంది. కరోనా వ్యాప్తి నియంత్రణలోకి వచ్చిన నేపథ్యంలో సంక్షోభ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను తిరిగి సాధారణ దిశగా పయనింపజేసేందుకు పలు దేశాల్లో ఆర్థిక, రోజువారీ కార్యకలాపాలకు ఆంక్షలు ఎత్తేసి అనుమతులు ఇస్తున్న క్రమంలో 'డెల్టా' వేరియంట్ వ్యాప్తి ప్రపంచ దేశాలను కలవరపరుస్తోంది. భారత్‌లో మొదటిసారిగా గుర్తించిన ఈ వేరియంట్ ఇప్పుడు పలు ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చెందింది. కొత్త వేరియంట్లు, అసమాన వ్యాక్సినేషన్ వలన ఆర్థిక వ్యవస్థకు ముప్పు నెలకొందని ఇటీవల వెనిస్‌లో సమావేశమైన జిా20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం హెచ్చరించిన నేపథ్యంలో.. డెల్టాతో ప్రభావితమౌతున్న దేశాలు తిరిగి ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చాయి.
లండన్‌లోని వెంబ్లే స్టేడియంలో ఆదివారం నాడు జరగనున్న యూరోా2020 ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ కోసం నగరంలో సమూహాలుగా గుమిగూడవద్దని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఈనెల 19 వరకు ఆంక్షలను తగిన విధంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఇయు, యూరోపియన్ ఎకనామిక్ ఏరియాలో 18 ఏళ్ల పైబడిన వారిలో పూర్తి వ్యాక్సిన్ అందుకున్న వారి సంఖ్య 44.1 శాతంగా మాత్రమే ఉందని యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ పేర్కొంది. దక్షిణకొరియాకు వ్యాక్సిన్ల సరఫరా కొరత వేధిస్తోంది. ఇప్పటి వరకు 5.2 కోట్ల జనాభాలో కేవలం 11 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందించారు. శనివారం నాడు కూడా ఇక్కడ వరుసగా మూడోరోజు రికార్డు స్థాయిలో 1,378 కొత్త కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో సోమవారం నుంచి పాఠశాలలు, బార్లు, క్లబ్‌లు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఇద్దరి కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై నిషేధం విధించింది. ఇటీవల కాలంలో భారీగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంక్షలు విధించడం తప్ప మరోమార్గం లేదని స్వయంప్రతిపత్త ఈశాన్య స్పానిష్ ప్రాంతమైన కెటలోనియా అధికారులు పేర్కొన్నారు. ఇంకా పలు ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.










