Jul 07,2021 14:36

కర్నూలు : ఎపిలో మహిళలు, బాలికల రక్షణ కోసం ఎపి ప్రభుత్వం దిశ వంటి యాప్‌తో విస్తృత ప్రచారానికి సంకల్పించినా.. బాలికలపై జరిగే అత్యాచారాలను మాత్రం అడ్డుకోలేకపోతోంది. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒక చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఎంతో ఆర్భాటంగా 'దిశ' వంటి యాప్‌ను స్వయంగా ముఖ్యమంత్రే ప్రారంభించినప్పటికీ ఇలాంటి ఘటన తాజాగా పునరావృతమైంది. కర్నూలులో అభం శుభం తెలియని ఆరేళ్ల బాలికపై ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి అత్యాచారం చేశాడు. జిల్లాలోని ఆదోనిలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని రోజులుగా బాలిక నీరసంగా ఉండటంతో గమనించిన తల్లిదండ్రులు బాలికను కూర్చోబెట్టి ఏమైందో చెప్పమని అడగగా.. బాలిక జరిగిన విషయాన్ని చెప్పింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు నిందితుడిని పట్టుకుని చితకబాది అనంతరం పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవలనే డిజిపి ఆఫీసుకు, పోలీస్‌ హెడ్‌ క్వార్టర్‌కు, సిఎం జగన్మోహన్‌ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలోనే ఒక యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకున్న ఘటన మరువకముందే ఈ ఘటన వెలుగు చూడటంపై మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.