కర్ణాటకకు 'మెకెదాతు' డ్యామ్ అనుమతులు ఇవ్వొద్దు!.. కేంద్రానికి కోరుతూ తమిళనాడు అఖిలపక్షం తీర్మానం
చెన్నై : కావేరీ నదిపై యడియూరప్ప ప్రభుత్వం నిర్మించతలపెట్టిన మెకెదాతు డ్యామ్‌పై కర్ణాటక, తమిళనాడుల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ డ్యామ్ నిర్మాణానికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వానికి ఎటువంటి అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అఖిలపక్ష సమావేశం ఒక ఏకగ్రీవ తీర్మానం చేసింది. కావేరి నది దిగువ రాష్ట్రాల అనుమతి లేకుండా మేకెదాతు వద్ద ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును తీర్మానం ఈ సందర్భంగా ప్రస్తావించింది. రాష్ట్ర సచివాలయంలో సోమవారం సిఎం ఎంకె.స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని లెజిస్లేచర్ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మెకెదాతుపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తూ కర్ణాటక ప్రభుత్వం డ్యామ్‌ను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటోందని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అఖిలపక్ష ఏకగ్రీవ తీర్మానం పేర్కొంది. ఈ డ్యామ్ నిర్మాణం గనుక జరిగితే తమిళనాడు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. మెకెదాతు వద్ద కర్ణాటక ప్రభుత్వం ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా నివారించేందుకు తమిళనాడు ప్రభుత్వం తీసుకునే చర్యలకు సంపూర్ణ మద్దతునిస్తామని అఖిలపక్ష సమావేశం మరో తీర్మానం చేసింది. తీర్మానాలను కేంద్ర ప్రభుత్వానికి అందించేందుకు అన్ని పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం త్వరలో ఢిల్లీ వెళ్లనుంది. బెంగళూరుతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు కావేరి బేసిన్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మెకెదాతు ప్రాజెక్టు చేపడతామని కర్ణాటక సిఎం యడియూరప్ప ఇటీవల ప్రకటించారు.










