Jan 02,2023 19:52

విద్యార్థికి సర్టిఫికెట్‌ ఇస్తున్న సిఐ సుధాకర్‌రెడ్డి

ప్రజాశక్తి-రాయచోటి: క్రమశిక్షణకు మారుపేరు ఎన్‌సిసి అని అర్బన్‌ సిఐ సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నేతాజీ సర్కిల్‌ ప్రధానోపాధ్యాయుల అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌సిసి విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఎన్‌సిసి కోర్సు విద్యార్థులలో నైతిక విలువలను పెంపొందించడంతో పాటు దేశం పట్ల వారి బాధ్యతలను తెలియజేస్తుందని, విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించి వారిని రేపటి సైనికులుగా, విద్యావేత్తలుగా, చక్కటి భావిభారత పౌరులుగా ఎదగటానికి ఎన్‌సిసి కోర్సు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనీ, కష్టపడి పనిచేసే తత్వాన్ని విద్యార్థులకు అలవాటు చేస్తుందని పేర్కొన్నారు. తదనంతరం ఎన్‌సిసి కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు 'ఎ' సర్టిఫికెట్లను ప్రదానం చేస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. పిఆర్‌టియు రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్‌, జిల్లా అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్‌సిసి కోర్సు ఓవరం లాంటిదని క్రమశిక్షణ కలిగిన భావిభారత పౌరులను నిర్మించటములో ఎన్‌సిసి కోర్సు పాత్ర విశిష్టమైనదిగా పేర్కొన్నారు. విద్యార్థులను అనునిత్యం ప్రోత్సహిస్తూ ఉత్సాహపరిచే కోర్సు ఆఫీసర్‌ సేవలు మరిచిపోలేనివిగా పేర్కొన్నారు. ఎన్‌సిసి కోర్సు ఆఫీసర్‌ ఖాదర్‌బాషా మాట్లాడుతూ ఎన్‌సిసి కోర్సు విద్యార్థులకు ఎంతో విలువైనదని విద్య ఉపాధి రంగాల్లో ఒక శాతం రిజర్వేషన్లను అందజేయటమే కాక విద్యార్థుల్లో శారీరక మానసిక వికాసానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.