ప్రజాశక్తి-జగ్గయ్యపేట
పార్టీలో అంతర్గతంగా జరిగే చర్చలను, మాట్లాడే విషయాలను, మాటలను వక్రీకరించి ప్రచారం చేసి పార్టీ ప్రయోజనాలకు భంగం కలిగించే వారిని ఉపేక్షించ బోమని మాజీ మంత్రి, విజయవాడ పార్లమెంటు టిడిపి అధ్యక్షులు నెట్టెం రఘురాం హెచ్చరించారు. శనివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘురాం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా సమస్యలు ఏమైనా ఉంటే సామాన్య కార్యకర్తను సైతం కలిసేందుకు అంగీకరిస్తున్నానని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తనతో చెప్పే విషయాలను పత్రికలకు, సోషల్ మీడియాకు వక్రీకరించి ప్రకటనలు చేయటం సమంజసం కాదన్నారు. తిరువూరు నియోజకవర్గానికి చెందిన కొందరు టిడిపి నాయకులు తనని కలిసి పలు అంశాలు చర్చించారని, ఈ సందర్భంగా చెప్పిన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో, కొన్ని పత్రికల్లో నియోజకవర్గ ఇన్చార్జిను మార్చాలని కోరినట్లు తెలియజేయటాన్ని ఖండించారు. తన వద్ద ప్రస్తావనకు రాని అంశాలతో ప్రకటనలు ఇవ్వడం సమంజసం కాదని, పార్టీ ప్రయోజనాలు రీత్యా ఇకపై ఇలాంటి చర్యలను అంగీకరించమని అన్నారు.










