Jan 29,2023 21:49

సరదాగా మాట్లాడుకుంటున్న కలెక్టర్‌, ఎస్‌పి

క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది : కలెక్టర్‌ఆసక్తిగా కలెక్టర్‌ వర్సెస్‌ ఎస్‌పి క్రికెట్‌ మ్యాచ్‌లు
ప్రజాశక్తి - రాయచోటి
క్రీడలతో మానసిక ఒత్తిడి తగ్గి, శారీరక ధడత్వం పెరుగుతుందని కలెక్టర్‌ గిరీష పిఎస్‌ తెలిపారు. కలెక్టర్‌ వర్సెస్‌ ఎస్‌పి జట్ల మధ్య ఆదివారం జిల్లా కేంద్రం రాయచోటి పోలీస్‌ పెరేడ్‌ మైదానంలో క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ టీమ్‌కు కలెక్టర్‌, ఎస్‌పి టీమ్‌కు ఎస్‌పి కెప్టెన్లుగా వ్యవహరించారు. టాస్‌ గెలిచిన కలెక్టర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నారు. ఈ క్రికెట్‌ మ్యాచ్‌ ఆసక్తికరంగా కొనసాగింది. మొదటగా కలెక్టర్‌ టీమ్‌ బ్యాటింగ్‌ చేసింది. ఆ టీం 20 ఒవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఇందులో కలెక్టర్‌ బ్యాటింగ్‌ చేసి 10 పరుగులు చేసి క్రీడాకారులను ఆకట్టుకున్నారు. అలాగే 12 బంతుల్లో కలెక్టర్‌ గన్‌మెన్‌ శ్రీనివాసులు 34 పరుగులు చేయడం గమనార్హం. ఆ తర్వాత 174 పరుగుల లక్ష్యం తో బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌పి టీమ్‌ 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. 13 పరుగుల తేడాతో ఒటమిని చవిచూసింది. ఇందులో ఎస్‌పి హర్షవర్దన్‌ రాజు 23 పరుగులు చేశారు. అత్యధికంగా ఎస్‌పి గన్‌మెన్‌ నాగ శివ 55 పరుగులు చేశారు. క్రికెట్‌ ఆట కలెక్టర్‌ ఆధ్వర్యంలో అత్యంత రసవత్తరంగా మారింది. 13 రన్నుల తేడాతో కలెక్టర్‌ టీం గెలుపొందింది. కలెక్టర్‌ టీం ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా అధికారుల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారని చెప్పారు. ఆటవిడుపుగా క్రీడలు నిర్వహిస్తే ఉద్యోగులకు కొంత మానసిక ప్రశాంతత లభిస్తుందని చెప్పారు. నిత్యం ప్రజాసేవలో ఉండే అధికారులకు, పోలీసులకు క్రికెట్‌ పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొనాన్రు. క్రికెట్‌ పోటీలు నిర్వహించడానికి ఎస్‌పి ముందుకు రావడం ఆహ్వానించదగ్గ విషయమని అన్నారు. అప్పుడప్పుడూ క్రికెట్‌ ఆడటం వల్ల శారీరక దారుఢ్యం పెంపొందించుకోవచ్చు అన్నారు. కార్యక్ర మంలో అడిషనల్‌ ఎస్పీ డాక్టర్‌ రాజ్‌ కమల్‌, రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, కలెక్టరేట్‌, రెవెన్యూ, పోలీస్‌, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.