ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం : పార్వతీపురం మన్యం జిల్లా ఐటిడిఎ పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో విద్యార్థులకు చదువుతో పాటు మంచి క్రీడాకారులను తయారుచేయాలనే లక్ష్యం నీరుగారింది. పదేళ్ల క్రితం గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస మండలాల్లో క్రీడా పాఠశాలలు, మైదానాలు ఏర్పాటుకు అధికారులు ప్రతిపాదించి ఏళ్లు గడుస్తున్నా అవి నేటికీ కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రాంతంలో వందలాది మంది ప్రతిభావంతులైన క్రీడాకారులున్నా వారికి సరైన ప్రోత్సాహం లేకపోవడంతో తమలోని ప్రతిభను బయటకు తీయలేక మరుగునపడుతున్నారు. విలువిద్య, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, జావాలింగ్‌త్రో , షార్ట్ పుట్ వంటి విభాగాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నారు.
స్థల సేకరణతో సరి
గుమ్మలక్ష్మీపురం, జియమ్మవలస మండలం రావాడ రాంభద్రపురంలో క్రీడా పాఠశాలల ఏర్పాటుకు గతంలో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. 12 ఎకరాల స్థలాన్ని రావాడలో కొంతమంది దాతలు విరాళంగా ఇచ్చారు. శాప్, ఐటిడిఎ అధికారులు స్థల పరిశీలన చేసి ప్రభుత్వానికి పలుమార్లు నివేదిక పంపించారు. జిల్లాకు ఒక పాఠశాల చొప్పున 2013లో మంజూరుకు లేఖ రాశారు. ఒక్కొక్క మైదానానికి అర ఎకరా స్థలంలో రూ.కోటీ 60 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. ఐటిడిఎ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో రన్నింగ్ ట్రాక్ కూడా నిర్మించారు. అంతా బాగానే ఉన్నా స్థల సేకరణతో సరిపెట్టిన అధికారులు పనులు మాత్రం నేటి వరకు చేపట్టలేదు.
పదహారేళ్ల కలగానే మినీ స్టేడియం
గుమ్మలక్ష్మీపురంలో ఉన్న హెచ్ గ్రౌండులో క్రికెట్ మినీ స్టేడియం పనులు నిర్మాణానికి గత పదహారేళ్లుగా ప్రతిపాదనలు చేసినా కలగానే మిగిలిపోయాయి. మొదటిసారి 2006లో అప్పటి సిపిఎం ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి మినీ స్టేడియం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు. ఇందుకోసం విజయనగరం నుంచి క్రీడా అధికారులు వచ్చి పరిశీలన కూడా చేశారు. అయితే క్రీడా మైదానం నిర్మాణానికి రూ.10 లక్షల వరకు అవసరం కాగా ఎమ్మెల్యే కోటా నుండి రూ.రెండు లక్షలు మంజూరు చేశారు. మిగతా రూ.8లక్షలు క్రీడా శాఖ అధికారులు మంజూరు చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. పనులు నేటికీ జరగలేదు. క్రీడా మైదానం సమీపాన టిడిపి హయాంలో 2018లో ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించారు. ప్రభుత్వం రూ.రెండు కోట్లు మంజూరు చేసింది. గుత్తేదారు పనులు ప్రారంభించి స్లాబ్ స్థాయి వరకు పనులు చేపట్టారు. అయితే ఎన్నికల కోడ్ రావడం, ప్రభుత్వం మారడంతో కాంట్రాక్టరుకు బిల్లులు చెల్లింపుల్లో జాప్యమైంది. దీంతో నాలుగున్నర ఏళ్లుగా ఇండోర్ స్టేడియం పనులు కూడా మధ్యలోనే నిలిచిపోయాయి.
జాతీయ స్థాయిలో రాణిస్తున్న గిరి పుత్రులు
గుమ్మలక్ష్మీపురం మన్యంలో చదువుతున్న విద్యార్థులు క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కురాసింగికి చెందిన కరాటే క్రీడాకారిణి తోయక శిరీష శ్రీలంకలో సైతం మంచి ప్రతిభను కనబర్చారు. గతంలో బంగారు పతకం సాధించింది. గుమ్మ లక్ష్మీపురం, భద్రగిరి గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కూడా రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇప్పటికే వివిధ క్రీడల్లో రాణిస్తూ తమ ప్రతిభను చాటుతున్నారు. క్రీడా శిక్షణ నిరంతరం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలమని ధీమాను క్రీడాకారులు వ్యక్తం చేస్తున్నారు. కనుమరుగవుతున్న క్రీడలకు జీవం పోయాలంటే క్రీడా శిక్షణ తప్పనిసరిగా ఉండాలని ఆశిస్తున్నారు.










