వేళాపాళా లేకుండా కరెంటు కోతలు
వేసవి వేళ ఉక్కపోత..దోమల మోత
అల్లాడిపోతున్న పిల్లలు, వృద్ధులు
ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9గంటలు దాటిందంటే సూర్యుడు ఉగ్రరూపం ప్రదర్శిస్తున్నాడు. ఇంటి నుంచి బయటకు రావడానికే ప్రజలు జంకే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇళ్లలో ఫ్యాన, లేదా కూలర్ కింద కూర్చోని కాస్త సేద తీరుదామంటే కరెంట్ ఉండటం లేదు. విద్యుత్ శాఖ అధికారులు అప్రకటిత కోతలతో జనం అల్లాడిపోతున్నారు. వేళాపాళలేని కోతలతో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కోతలు పెడుతుండటంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. వేడి, ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నా వాటి నివారణకు చర్యలు తీసుకోవడంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. ఏదైనా సందర్భంలో కరెంటు సమాచారం తెలుసుకునేందుకు విద్యుత్ శాఖ కార్యాలయాలకు ఫోన్ చేస్తే..ఫోన్లు ఎత్తి సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో సంబంధిత అధికారులు, సిబ్బంది ఉన్నారన్న వాదనలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. మెయింటనెన్స్ డే పేరుతో వారానికొకసారి ఐదారు గంటలు కోత విధిస్తూనే అనధికారికంగా కూడా విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు.
పల్లెల్లో వేళాపాళా లేకుండా కోతలు
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంటోంది. వేళాపాళా లేకుండా విద్యుత సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నట్లు పల్లె ప్రజలు వాపోతున్నారు. ఒకసారి కరెంట్ పోతే మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. రాత్రి, పగలు అన్న తేడాలు లేకుండా కోతలు అమలవుతున్నాయి. పగటి వేళల్లో కరెంటు పోతే చెట్ల కింద..పొలాల్లో సమయం గడిపేస్తున్నారు. రాత్రి వేళల్లో కరెంటు తీసేస్తుండటంతో వారి పరిస్థితి దయనీయంగా తయారైంది.
కోతలు లేకుండా సరఫరా చేయాలి
పగలు, రాత్రి అన్న లేడా లేకుండా కరెంటు పోతోంది. కరెంటు పోతే ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. ఉక్కపోత, వేడితో తీవ్ర ఇబ్బందులు పడ్డాం. చిన్న పిల్లలు మరింత ఇబ్బందిపడుతున్నారు. ఎండాకాలాన్ని దష్టిలో ఉంచుకుని కోతలు లేకుండా కరెంటు సరఫరా చేయాలి.
- రేణుక, డిబిఎన్.పల్లె, గహిణి, రాజంపేట.
ఇబ్బంది పడుతున్న పిల్లలు, వృద్ధులు
ఉక్క పోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే కరెంటు కోతలు తీవ్రంగా వేధిస్తున్నాయి. మనస్ఫూర్తిగా భోజనం కూడా చేయలేకున్నాం. చిన్న పిల్లలు, వద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ప్రజల ఇబ్బందులు గుర్తించి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి.
- గురుప్రసాద్, భువనగిరిపల్లె, రాజంపేట.
అధికారులు నిర్లక్ష్యం వీడాలి
భువనగిరిపల్లెలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి విద్యుత్ ఏర్పాట్లలో భాగంగా సరఫరా నిలిపివేస్తున్నారు. ఒక్క చోట ఎల్‌సి తీసుకుని ఇతర గ్రామాలకు విద్యుత్తు సరఫరా చేయాలి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బంది పడుతున్నాం.
- హరికృష్ణ, డిబిఎన్.పల్లె, రాజంపేట.
అసౌకర్యం కలగకుండా చర్యలు
భువనగిరిపల్లె లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించి విద్యుత్ సరఫరా చేసేందుకు కొన్ని గ్రామాల్లో కోతలు విధించాల్సి వచ్చింది. భువనగిరిపల్లె వద్ద ఎల్‌సి తీసి మిగిలిన గ్రామాలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటాం. ప్రజలకు నాణ్యమైన విద్యుత్తు అందించేందుకు కృషి చేస్తాం.
- ఈశ్వర్‌రాజు, రూరల్ ఎఇ, విద్యుత్ శాఖ, రాజంపేట.
- కరెంట్ కోత.. ఉక్కపోత










