Jun 14,2023 21:21

'కొప్పర్తి' పైప్‌లైన్

కడప ప్రతినిధి : సోమశిల నుంచి కొప్పర్తి నీటి సరఫరా పైప్‌లైన్‌ పైపుల తరలింపునకు రంగం సిద్ధమైంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ హయాంలోని రూ.450 కోట్లు పైప్‌లైన్‌ పనులకు కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పైప్‌లైన్‌ అలైన్‌మెంట్‌ పొడవునా 2.4 డయాఫ్రమ్‌ వాల్‌ సామర్థ్యంతో కూడిన పనులను ఏర్పాటు చేశారు. వైఎస్‌ఆర్‌ అనంతర ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా పైప్‌లైన్‌ పనుల్లో కదలిక లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో కొప్పర్తి పారిశ్రామిక వాడలో పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు పెరిగిన నేపథ్యంలో వృథాగా పడి ఉన్న పైప్‌లైన్‌ పైపులను ఇతర ప్రాంతాలకు తరలించాలనే ఉద్దేశంతో ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఇ, కార్పొరేషన్‌ పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీర్‌, జాయింట్‌ కలెక్టర్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇంజినీరింగ్‌ ఇన్‌ఛీప్‌ నారాయణరెడ్డి సోమశిల ఎత్తిపోతల పనులను పరిశీలించినట్లు తెలిసింది. కొప్పర్తి పారిశ్రామికవాడకు పరిశ్రమల తాకిడి పెరిగిన నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం నీటి సరఫరా కల్ప నపై దృష్టి సారించింది. 33 కిలోమీటర్ల మేర 800 మిల్లీమీటర్ల డయా మీటర్ల వ్యాసార్థం కలగిన పైప్‌లైన్‌ల ద్వారా 480 మిలియన్‌ లీటర్‌ ఫర్‌డే (ఎంఎల్‌డి) నీటిని సరఫరా నిమిత్తం రూపకల్పన చేయడం తెలిసిందే. ఇందులో 1460 ఎంఎల్‌డి సామర్థ్యం కలిగిన సమ్మర్‌ స్టోరేజీ సంప్‌ పను లను చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్రహ్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి ఆర్‌టిపిపికి పైప్‌లైన్‌లతో నీటిని సర ఫరా చేయాలని ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆర్‌టిపిపితో అవగాహన కుదుర్చుకుని తాత్కాలిక ప్రాతిపదికన నీటి సరఫరా పైప్‌లైన్‌కు సోమశిల ఎత్తిపోతల పనుల పైపులను తరలించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట అవతలి ప్రాంతం నుంచి కడప జిల్లా కేంద్రానికి సమీపం వరకు సుమారు 30 కిలోమీటర్ల పొడవునా నిరుపయోగంగా పడి ఉన్న ఖరీదైన పైపులను ఉపయోగంలోకి వస్తే ప్రజాధనాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉండేదని చెప్పవచ్చు. దీనిపై ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఇ శ్రీనివాసులను ఫోన్‌లో పలుమార్లు సంప్రదించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.