లండన్ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కుదిపేసింది. కోవిడ్‌ను అరికట్టేందుకు శాస్త్రవేత్తలు తీవ్ర పరిశోధనలు చేశారు. పలు వ్యాక్సిన్లు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికీ పలు పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరో కీలకాంశాన్ని అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదేమిటంటే..
స్త్రీ-పురుషుల రోగనిరోధక వ్యవస్థలో వైరుధ్యాలు..
కోవిడ్-19 కారక కరోనా వైరస్‌కు రోగనిరోధక వ్యవస్థలు స్పందిస్తున్న తీరులో స్త్రీ, పురుషుల మధ్య వైరుధ్యాలు ఉన్నట్లు యేల్ విశ్వవిద్యాలయ అమెరికా శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. దీని ఆధారంగా కొత్త ఔషధాలకు లక్ష్యాలను కనుగొనవచ్చని ఆశాభావం వ్యక్తపరిచారు.
రోగనిరోధక ప్రతిస్పందనకు అనుగుణంగా ఆమ్లం..
తీవ్రస్థాయిలో కోవిడ్ తీవ్రత, మరణం ముప్పు ఎక్కువగా ఉండే పురుష రోగుల్లో జీవక్రియకు సంబంధించిన ఒక చర్యాక్రమం.. రోగనిరోధక ప్రతిస్పందనకు అనుగుణంగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కోవిడ్ సోకిన స్త్రీలతో పోలిస్తే ఈ మహమ్మారి బారినపడ్డ పురుషుల్లో కైనురెనిక్ ఆమ్లం ఎక్కువగా ఉంటుందని, ఇది అమినో ఆమ్ల జీవక్రియకు సంబంధించిందని తెలిపారు. స్కిజోఫ్రీనియా, హెచ్‌ఐవి సంబంధిత వ్యాధులున్నవారిలోనూ ఈ ఆమ్లం స్థాయి అధికంగా ఉంటున్నట్లు ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్థారించారు.
పురుషుల్లో కైనురెనిక్ ఆమ్ల నిష్పత్తి ఎక్కువ
కైనురెనైన్ అనేది ఎల్-ట్రిప్టోఫాన్ అనే అమినో ఆమ్లం ద్వారా ఉత్పత్తవుతుంది. ఇది నియాసిన్ అనే పోషక పదార్థాన్ని తయారుచేయడంలో సాయపడుతుంది. తీవ్రస్థాయిలో కోవిడ్ బారినపడిన పురుషుల్లో మహిళలతో పోలిస్తే కైనురెనిక్ ఆమ్ల నిష్పత్తి ఎక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తల పరిశోధనలో స్పష్టమయింది.
కొత్త చికిత్స మార్గాలను కనిపెట్టవచ్చు..
ఈ అమ్లంపై మరిన్ని పరిశోధనలు చేసి వ్యక్తిలోని రోగనిరోధక స్థాయి.. కరోనా వైరస్‌కు ఎలా స్పందిస్తుందనేది గుర్తించొచ్చు. దానికనుగుణంగా కొత్త చికిత్స మార్గాలను అభివఅద్ధి చేయవచ్చని, కోవిడ్‌ను నివారించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.










