- మొదటి కిస్తు కంటే రెండవ కిస్తు 6.67 లక్షలు తక్కువ
- మొత్తం అర్హుల్లో 13.19 లక్షలు ఊస్టింగ్
- రైతు భరోసాపై ప్రభావం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతుల పెట్టుబడి సాయానికి సంబంధించిన కేంద్ర పథకం పిఎం కిసాన్‌లో కోతల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వాయిదాల్లో రూ.రెండు వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉండగా మొదటి కిస్తు కంటే రెండవ కిస్తుకు లబ్ధిదారులు 6.67 లక్షల మంది తగ్గారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ నుండి పిఎం కిసాన్ సాయం కోసం 58.32 లక్షల మంది అర్హులైన రైతులు నమోదు చేసుకోగా 13.19 లక్షల మందికి సొమ్ము పడలేదు. పిఎం కిసాన్‌తో కలిపి ఎపి ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం లబ్ధిదారులను కుదించడంతో ఆ మేరకు అందిస్తామన్న భరోసా సొమ్ము తగ్గుతోంది. కొన్ని కేసుల్లో ఎపి వాటా మాత్రమే రైతుల అకౌంట్లలో జమ అయింది. కేంద్ర వాటా పడలేదు.
అందరికీ ఎప్పుడూ లేదు
సార్వత్రిక ఎన్నికల ముంగిట్లో కేంద్రం పిఎం కిసాన్‌ను తెరమీదికి తెచ్చింది. సొంత భూమి కలిగిన రైతులకు ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6 వేలు బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామంది. ఇప్పటి వరకు తొమ్మిది కిస్తులు విడుదల చేసింది. లబ్ధిదారుల కుదింపునకు కేంద్రం రోజుకో షరతు పెడుతుండటంతో లబ్ధిదారుల సంఖ్య అంతకంతకూ తగ్గుతోంది. రాష్ట్రం నుండి 58,32,389 మంది రైతులు పథకానికి అర్హులని ఎపి ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. పథకం మొదలయ్యాక తొమ్మిది విడతల్లో సొమ్ము విడుదల చేయగా ఎప్పుడూ పూర్తి స్థాయిలో లబ్ధిదారులందరికీ సాయం అందలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూలై పీరియడ్ మొదటి కిస్తు 51,80,395 మందికి జమ అయింది. అర్హత సాధించిన లబ్ధిదారుల్లో 6,51,994 మందికి (11 శాతం) సాయం అందలేదు. కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తున్న కాలమిది.
ఈ ఏడాది రెండవ కిస్తు పీరియడ్ ఆగస్టు-నవంబర్‌లో 45,13,010 మందికే డబ్బు పడింది. ఈ సంవత్సరం మొదటి కిస్తు పొందిన వారి కంటే 6,67,385 మంది తక్కువ. సహాయానికి అర్హత సాధించిన మొత్తం రైతుల్లో 13,19,379 మందికి సొమ్ము పడలేదు.
సెంటర్‌ను అడగట్లేదు
పిఎం కిసాన్ లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యత రాష్ట్రానికే అప్పగించినా, ఇక్కడి నుండి పంపుతున్న లబ్ధిదారులందరికీ సాయం చేయట్లేదు. ఉన్న ఆంక్షలకు తోడు కొత్తగా రేషన్‌కార్డు కావాలంటోంది కేంద్రం. అక్కడితో ఆగకుండా ఇ-కెవైసి చేయించాలంటోంది. సాంకేతిక కారణాల వలన లబ్ధిదారుల సంఖ్య కుదించుకుపోతోంది. ఇదిలా ఉండగా నవరత్నాల్లో భాగంగా ఎపి ప్రభుత్వం రైతు భరోసా స్కీంను అమలు చేస్తోంది. పిఎం కిసాన్ సాయం రూ.6 వేలు, రాష్ట్ర వాటా రూ.7,500 వెరసి రూ.13,500 జమ చేస్తామంది. పిఎం కిసాన్‌లో లబ్ధిదారులు ఎగిరిపోతే రాష్ట్ర సహాయం అందదు. ఒక వేళ రాష్ట్ర సాయం జమ అయినా కేంద్రం నుండి అందకపోతే భరోసా అసలు లక్ష్యం దెబ్బ తింటుంది. పిఎం కిసాన్ లబ్ధిదారుల కుదింపుపై కేంద్రంతో సంప్రదించే విషయంలో ఎపి సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందన్న ఆరోపణలొస్తున్నాయి.










