Feb 28,2021 12:00

అనగనగా ఒక ఊరిలో అమ్ము అనే కోతి దారిన వెళుతూ ఉంది. ఇంతలో దారి పక్కన ఒక వస్తువు దాని దృష్టిని ఆకర్షించింది. దగ్గరకు వెళ్లి చూస్తే అది ఒక కొబ్బరి చిప్ప. అమ్ముకు అదేంటో అర్థం కాలేదు. పట్టుకొని చూసింది. పైన గరుకుగా.. లోపల మెత్తగా ఉంది. మెత్తగా వున్న కొబ్బరిని కొరికి చూసింది. రుచిగా వుండటంతో తినేసింది. అయినా దానికి ఖాళీ కొబ్బరిచిప్పను పారవేయటానికి మనసొప్పలేదు. వెంట తీసుకుని బయలుదేరింది.


తాను నివసించే చెట్టుపై ఎక్కి భద్రంగా ఒకచోట దాచింది. ప్రతిరోజూ నిద్ర లేవగానే అమ్ము ఆ కొబ్బరిచిప్పను ఒకసారి చూసుకొని దినచర్య ప్రారంభించేది. దానిని అపురూపంగా చూసుకొనేది. అమ్మును చూసి చెట్టుపై వున్న మిగతా కోతులు నవ్వుకునేవి. ఒకరోజు జోరున వాన పడుతుంది. చెట్టుపై వున్న కోతులన్నీ తడుస్తున్నాయి. అమ్ము కూడా తడిసిపోతుంది. తడవకుండా ఏం చేయాలో దానికి తోచలేదు. ఇంతలో అమ్ముకు ఒక ఆలోచన వచ్చింది. అంతే తాను భద్రంగా దాచుకున్న కొబ్బరిచిప్పను బయటకు తీసి తల మీద పెట్టుకుంది. అది గొడుగులా తడవకుండా కాపాడింది. దాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మిగతా కోతులు కేసి చూస్తూ ... వేళాకోళమాడింది. అలాగే ఎండలు అధికంగా ఉన్న సమయంలో ఆ కొబ్బరిచిప్పను రక్షణకవచంలా తల మీద పెట్టుకుని తిరిగేది. అమ్ము కొబ్బరి చిప్ప దొరకటం అదృష్టంగా భావించింది. మిగతా కోతులకు కూడా కొబ్బరి చిప్ప దొరకటం గురించి గొప్పగా చెప్పేది. అవి దాని బడాయి మాటలకు నవ్వుకునేవి.


ఒకరోజు సాయంత్రం అమ్ము స్నేహితులతో కలిసి చెట్టు కింద ఆడుకుంటుంది. అదే సమయంలో ఈదురుగాలులు ప్రారంభమయ్యాయి. గాలుల వేగానికి చెట్టు కొమ్మలు ఊగటం ప్రారంభించాయి. ఆకాశంలో మబ్బులు కూడా కమ్ముకుంటున్నాయి. కోతులన్నీ భయంతో ఆట మానేసి ఓ మూలకు చేరుకున్నాయి. అమ్ము మాత్రం ధైర్యంగా గాలి వచ్చినా .. వాన పడినా భయం లేదు ... నా దగ్గర కొబ్బరిచిప్ప ఉందిగా అన్నది. ఆ సమయంలో కూడా అమ్ము స్వార్థంతో తన గురించే ఆలోచించటం మిగతా కోతులను నచ్చలేదు. చిరుజల్లులు ప్రారంభం అయ్యాయి. అమ్ము ఆనందంతో గెంతులేయసాగింది. ఇంతలో ఈదురుగాలుల ధాటికి చెట్ల కొమ్మలు భారీగా ఊగటం ప్రారంభించాయి. గాలి వేగానికి కొమ్మలు కదలటంతో అమ్ము దాచుకున్న కొబ్బరిచిప్ప దడాలున పైనుంచి కింద గెంతులేస్తున్న అమ్ము నెత్తిన పడింది. పాపం అమ్ము తల బొప్పి కట్టింది. పైగా కొబ్బరి చిప్ప రెండు ముక్కలైంది. ఏడుస్తూ ఉన్న అమ్మును మిగతా కోతులు దగ్గరకు తీసుకున్నాయి. తల మీద బొప్పి కట్టిన ప్రదేశంలో ఆకుపసరు రాసి కట్టు కట్టాయి. అమ్ము గతంలో తన ప్రవర్తనకు సిగ్గుపడుతూ మిగతా కోతుల పట్ల కృతజ్ఞతగా చూసింది. ఆ తర్వాత నుంచి అమ్ము గొప్పలకు పోకుండా మిగతా కోతులతో స్నేహంగా ఉండేది.
                                            * తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర, 9492309100