Mar 22,2022 06:45

    విశాఖలో ల్యాండ్‌ పూలింగ్‌ను రైతులు వ్యతిరేకించినా బలవంతంగా భూములను లాక్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని వ్యతిరేకిస్తూ భూ సేకరణ, ల్యాండ్‌ పూలింగ్‌, రైతు, కూలీ నిర్వాసితుల సంక్షేమ సంఘం 2020లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) వేసింది. సుమారు ఏడాదిన్నర పాటు విచారణ జరిపిన కోర్టు ఈ నెల 11న స్వచ్చందంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన రైతులు నుండి మాత్రమే భూమి సమీకరించే అధికారం వి.ఎం.ఆర్‌.డి.ఎ కు ఉందని, బలవంతంగా ల్యాండ్‌ పూలింగ్‌ చేయడానికి వీల్లేదని రూలింగ్‌ ఇచ్చింది.
    దీనిని అడ్డగోలుగా అన్వయించుకుని ప్రభుత్వ యంత్రాంగం ఆగమేఘాల మీద బుల్డోజర్లు, ప్రొక్లెయినర్లు, ట్రాక్టర్లు పెట్టి భూమిని చదును చేస్తున్నారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి గ్రామ సభలు పెట్టి ప్రజలకు వివరించకుండా ప్రభుత్వ యంత్రాంగం దూకుడుగా వ్యవహరిస్తోంది. రెవెన్యూ అధికారులు సబ్బవరం మండలం పెద్దగొల్లలపాలెం, గాలి భీమవరం, ఎరుకు నాయుడుపాలెం, నంగి నారపాడు, గంగవరం, పద్మనాభం మండలంలోని నర్సాపురం, ఆనందపురం మండలంలోని గండిగుండం, చందక, అగ్రహారం, అనకాపల్లి మండలంలోని మామిడిపాలెం, జంగాలపాలెం గ్రామాల్లో ట్రాక్టర్లు, జేసిబిలతో జీడి, మామిడి, కందులు, వరి, ఆకుకూరలు, చిరుదాన్యాలు వంటి పంటలను నాశనం చేసి చదును చేస్తున్నారు. కళ్లెదురుగానే తమ బిడ్డలతో సమానంగా పెంచిన చెట్లను తొలగిస్తుంటే పేద రైతుల బాధలు వర్ణణాతీతం. జీడి, మామిడి పంటలు మరో రెండు నెలల్లో చేతికి రానున్న తరుణంలో ప్రభుత్వ దుందుడుకు చర్య రైతులను హతాశుల్ని చేసింది. ఏమిటీ అన్యాయమని ప్రశ్నిస్తున్న బాధితులను గ్రామ వాలంటీర్లు నుండి పై అధికారుల వరకు బెదిరిస్తున్నారు. ఎవరైనా రైతు ఒక చెట్టు తొలగించాలంటే ఫారెస్టు అధికారులు ఆగమేఘాల మీద వచ్చి అడ్డుకుంటారు.. కాని పర్యావరణానికి విఘాతం కలిగిస్తూ వేల చెట్లను కాంట్రాక్టర్లు ప్రొక్రెయినర్లతో తొలగిస్తుంటే . అధికారులు కనీసం అటువైపు తొంగి చూడడానికి కూడా ఇష్టపడడం లేదు. స్థానికులు ధైర్యం చేసి నిలదీస్తే కాంట్రాక్టర్లు బెదిరింపులకు దిగుతున్నారు. రైతుల సమ్మతి లేకుండా భూములను బలవంతంగా పూలింగ్‌కు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా అధికారయంత్రాంగం బాహాటంగా ఉల్లంఘిస్తోంది. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయకుండా ప్రభుత్వమే అతిక్రమిస్తే ఇక పేదలకు దిక్కెవరు ?
   విశాఖ, అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 10 మండలాల్లో 54 గ్రామాల నుండి 2904 మంది రైతుల నుండి 6116.50 ఎకరాల భూమిని విఎంఆర్‌డిఎ ద్వారా భూ సేకరణ చేస్తున్నారు. గౌరవ హైకోర్టు తీర్పును గౌరవించడం లేదు. రైతులను తీవ్ర ఒత్తిడి చేసి భూ సమీకరణకు అంగీకరిస్తున్నట్లు బలవంతంగా అధికారులు సంతకాలు చేయించారు. సహజ న్యాయ సూత్రాలను, ప్రమాణాలను వి.ఎం.ఆర్‌.డి.ఎ, రెవెన్యూ అధికారులు ఉల్లంఘిస్తున్నారు.
    ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ల్యాండ్‌పూలింగ్‌ను వ్యతిరేకించిన జగన్మోహన్‌రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక విశాఖలో ల్యాండ్‌ పూలింగ్‌ ఎందుకు చేపడుతున్నారు? ఇది రైతులను మోసగిండం కాదా? గ్రామ సభల్లో భూములు ఇవ్వబోమని సన్న, చిన్నకారు రైతులు తెలియజేసిన అభిప్రాయాలకు విలువ లేదా ?
    తరతరాలుగా ఈ భూములను నమ్ముకొని జీవిస్తున్న రైతులకు జీవన్మరణ సమస్యగా మారింది. రైతులు భూములను ఇవ్వబోమని స్పష్టం చేస్తే, చూశారా, పేదలకు ఇళ్లు, ఇళ్ళస్థలాలు ఇస్తామంటే మీ రైతులు ఆ భూములు ఇవ్వడంలేదని ప్రచారం చేస్తూ, రైతులకు వ్యతిరేకంగా పేదలను ఎగదోసేందుకు యత్నిస్తున్నారు. ఈ భూముల్లో జీడి, మామిడి, వరి, సపోటా, యూక్లిప్టస్‌, చోళ్లు, కందులు, కాయగూరలు వంటి పంటలు పండించి విశాఖ నగరానికి అతి చౌకగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇలాంటి సారవంతమైన భూములను బలవంతంగా లాక్కోవడం ఎంత వరకు న్యాయం ?
    ప్రభుత్వానికి, పేదలకి ఇళ్ళు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే చిత్తశుద్ధి వుంటే విశాఖ నగరంలో లక్షన్నర ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని, భూ రికార్డులు తారుమారు చేశారని గత తెలుగుదేశం ప్రభుత్వం సిట్‌ వేసింది. ఆ నివేదికను బహిర్గతం చేయకుండా మరలా నేడున్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో సిట్‌ ను వేసింది. ఈ రెండు కమిటీల నివేదికలను వెల్లడించకుండా భూ కామందులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు,,, రాజకీయ నాయకుల కొమ్ముకాసూ,్త వారు ఆక్రమించిన భూములకు రక్షణ కల్పిస్తున్నారు. నిజాయితీగా ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే విశాఖ నగరంలో ఉన్న లక్షల మంది నిరుపేదలకు ఇళ్లు, ఇళ్ళ స్థలాలకు భూములను కేటాయించినా ఇంకా వేలాది ఎకరాలు భూములు ప్రభుత్వ అవసరాలకు మిగిలి వుంటుంది. కాని ఆ భూముల జోలికి వెళ్ళకుండా నిరుపేద రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నారు.
    రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం భూములు కావాలంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూములకు నష ్టపరిహారం ఇచ్చి ఆ భూములపై ఆధారపడిన కూలీలకు, వృత్తిదారులకు చట్టం ప్రకారంగా ప్యాకేజీ ఇచ్చి ఆ భూములను సేకరించాలి. దీనికి భిన్నంగా 2016 విఎంఆర్‌డిఎ నిబంధనల ప్రకారం భూములు సేకరిస్తున్నామని హైకోర్టుకు ప్రభుత్వం తెలియజేసింది.. విఎంఆర్‌డిఎ నిబంధనలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి రెడ్‌ కార్పెట్‌ పరచినట్టే పేద రైతుల దగ్గర తీసుకుంటున్న భూములకు ఢి.పారం పట్టా ఉన్న వారికి ఎకరాకు 900 గజాలు, 10 సంవత్సరాలకు పైబడి సాగుచేసుకుంటున్న భూముకు 450 గజాలు, 5 నుండి 10 సంవత్సరాల మధ్యలో సాగుచేసుకుంటున్న భూములకు 250 గజాల స్థలం కేటాయించి మిగిలిన భూములను అభివృద్ధి చేసి కొంత భాగం ఇళ్లులేని పేదలకి ఇచ్చి మిగిలిన భూములను విఎంఆర్‌డిఎ స్వాధీనంలో పెట్టుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయడానికి పూనుకుంటున్నది.ఉడా అనేది మధ్య తరగతి ప్రజానీకానికి ఇళ్ళు నిర్మాణం చేయడం, ఇళ్లు స్థలాలు కేటాయించడం ప్రధాన ద్యేయంగా ఏర్పడింది. నేడు దానిని విఎంఆర్‌డిఎ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపార సంస్థగా గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం,, నేడు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మార్చేస్తున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆదాయ వనరుగా విఎంఆర్‌డిఎను ఉపయోగపెట్టుకుంటుంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నయో గుర్తించి వాటిని ల్యాండ్‌ బ్యాంక్‌, ల్యాండ్‌ పూలింగ్‌ వంటి పేర్లతో స్వాధీనం చేసుకుంటోంది. .తద్వారా రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు కల్పవృక్షంగా మారింది.. కనీస మార్కెట్‌ ధర ముందు విఎంఆర్‌డిఎ నుండి ప్రకటించి లక్షల రూపాయలు ప్రైవేట్‌ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు సంపాదించుకొనేందుకు ఉపయోగపడుతోంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూములుగా మార్చే దానిలో దీని పాత్ర కీలకమైనది. ఇటీవల విశాఖ జిల్లాలోని పాయకరావుపేట మండలం నుండి, విజయ నగరం జిల్లా పూసపాటి రేగ మండలం వరకు సముద్ర తీర ప్రాంత మంతటితో పాటు, విశాఖ, విజయనగరం కార్పొరేషన్లు, ఎలమంచిలి మునిసిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ, రెండు జిల్లాలలోని 31 గ్రామీణ మండలాలను విఎమ్‌ఆర్‌ డిఎ పరిధిలోనికి తీసుకు వచ్చారు. ఇలా దీని పరిధిని 1713 కిలోమీటర్ల నుండి 4873 కిలోమీటర్లకు విస్తరించారు.
    చివరికి నాన్‌షెడ్యూల్‌ ప్రాంతాల్లో పేద గిరిజనులు సాగుచేకుంటున్న భూములను కూడా వదలకుండా దీని పరిధిలోకి తీసుకొచ్చారు. దీనివల్ల పేదరైతులు, బడుగు బలహీనవర్గాలు, చేతివృత్తిదారులు తీవ్ర అన్యాయానికి గురౌతున్నారు. వీరి ఆవేదన పట్టించుకొనే నాధుడే కరువయ్యారు. ఇలాంటి అంశాలను ప్రభుత్వం సచివాలయాల ద్వారా పరిష్కరిస్తానని గౌరవ ముఖ్యమంత్రిగారు తెలియజేశారు. నేడు వాలంటీర్ల దగ్గర నుండి సచివాలయ సిబ్బంది, రెవెన్యూ యంత్రాంగం, పోలీసులు యావత్తు ఏకోన్ముఖంగా భూములు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. బలవంతపు ల్యాండ్‌ పూలింగ్‌ను రైతులు వ్యతిరేకిస్తుంటే, మీకు సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించడమేగాక, పోలీసులను గ్రామాల్లోకి పంపి భయపెడుతున్నారు. ల్యాండ్‌పూలింగ్‌ రైతులు, వ్యవసాయ కార్మికులు, వృత్తిదారుల పాలిట శాపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎదిరించి భూములను పరిరక్షించుకొనేందుకు పేదరైతులు, కూలీలు ఐక్యంగా ఉద్యమించాలి.
 

సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి
9490098791
కె.లోకనాధం

కె.లోకనాధం