Jul 11,2021 20:36

రియో డి జనీరో : మరడోనా లాంటి ఆటగానికి సైతం అందలేదు. అద్భుతమైన జట్టు, స్టార్‌ ఆటగాళ్లు ఎందరున్నా ఎన్నో ఏళ్లు ఎదురుచూపులు తప్పలేదు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మెస్సీ సారథ్యంలో అర్జెంటీనా కోపా అమెరికా కప్‌ను సొంతం చేసుకుంది. ఆదివారం ఉదయం హోరాహోరీగా జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ఢిపెండింగ్‌ ఛాంపియన్‌ బ్రెజిల్‌ను ఓడించి తన కలను నెరవేర్చుకుంది. గెలుపు కోసం ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోరాడాయి. చివరికి అర్జెంటీనా 1-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించి 15వ సారి కొపా కప్‌ను కైవసం చేసుకుంది. ఆట మొదటి అర్ధభాగంలో ఏంజెల్‌ డీ (21వ నిమిషం) గోల్డెన్‌ గోల్‌ చేయడంతో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. పదే పదే గోల్‌ పోస్ట్‌పై దాడి చేసిన బ్రెజిల్‌ గోల్‌ చేయనీయకుండా అడ్డుపడి అర్జెంటీనా కప్‌ను ముద్దాడింది. అర్జెంటీనా స్టార్‌ ఆటగాడు మెస్సీ తన ప్రొఫెషనల్‌ క్లబ్‌ కెరీర్‌లో 34వ టైటిల్స్‌ గెలిచినా, దేశం తరుపున ఒక్క మేజర్‌ టైటిల్‌ను కూడా అందించలేకపోయాడు. తాజా విజయంతో అతని ఖాతాలో ఆ లోటు భర్తీ అయినట్లే. చివరి సారి అర్జెంటీనా కోపా అమెరికా కప్‌ను 1993లో గెలుచుకుంది. 2004, 2007, 2015, 2016 సంవత్సరాల్లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.