Feb 08,2023 18:47

కల్యాణ మంటపం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెఇఒ వీరబ్రహ్మం

- ఏప్రిల్‌ 5న స్వామివారి కల్యాణోత్సవం
- ముఖ్యమంత్రిచే పట్టు వస్త్రాల సమర్పణ
- సమీక్షా సమావేశంలో టిటిడి జెఇఒ వీరబ్రహ్మం
ప్రజాశక్తి-ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30వ తేదీ నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టిటిడి జెఇఒ వీరబ్రహ్మం చెప్పారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధవారం ఆయన అధికారులతో కలసి క్షేత్రస్థాయిపరిశీలన, సమీక్ష జరిపారు. అనంతరం వీరబ్రహ్మం మాట్లాడుతూ మార్చి 30వ తేదీ సాయంత్రం అంకురార్పణతో శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. ఏప్రిల్‌ 5వ తేదీ శ్రీ కోదండరాముడి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో ఇప్పటికే సమీక్ష జరిపి అనేక సూచనలు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలకు, స్వామివారి కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. నెలరోజుల ముందు నుంచే టిటిడి ఈ పనులను ప్రారంభించిందన్నారు. కల్యాణోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాల్సిన గ్యాలరీలు, వాటిలోకి భక్తులను అనుమతించాల్సిన విధానం, భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీ ఏర్పాట్లపై సమీక్ష జరిపామన్నారు. గ్యాలరీల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి మరింత మెరుగైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కల్యాణ వేదిక అలంకరణ, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఆకట్టుకునేలా నిర్వహిస్తామన్నారు. కల్యాణానికి హాజరయ్యే భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. టిటిడి ఇఒ ఎవి ధర్మారెడ్డి రెండు వారాల్లో జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. సమావేశంలో టిటిడి చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావు విద్యుత్‌ విభాగం ఎస్‌ఇ వెంకటేశ్వర్లు, ఆలయ డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, డిప్యూటీ ఇఒలు గుణభూషణ్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఇఇ సుమతి, అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్‌ సునీల్‌ కుమార్‌, డిఎఫ్‌ఒ శ్రీనివాస్‌, గార్డెన్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌, ఎలక్ట్రికల్‌ డిఇ చంద్రశేఖర్‌, ప్రచురణల విభాగం ప్రత్యేకాధికారి రామరాజు పాల్గొన్నారు. అంతకు ముందు జెఇఒ వీరబ్రహ్మం రాజంపేటలోని 108 అడుగుల శ్రీతాళ్ళపాక అన్నమాచార్య విగ్రహం ఆవరణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.