Nov 02,2023 20:31

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి నరసింహ

రాజంపేట అర్బన్‌ : పట్టణంలో సాయినగర్‌లో ఉన్న రంగయ్య నవోదయ, సైనిక్‌ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు తీసుకోవడంలో విద్యా శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులను తీరును నిరసిస్తూ గురువారం పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, పిడిఎస్‌యు జిల్లా జిల్లా అధ్యక్షులు నాగేశ్వర మాట్లాడుతూ కోచింగ్‌ సెంటర్లపై చర్యలు చేపట్టాలని కోరుతూ గత శుక్రవారం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్‌ పురుషోత్తంకు చిట్వేలి మండలంలో పత్రం సమర్పించడమైనదని, మండల విద్యాశాఖ అధికారులు కానీ, జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ ఇంతవరకు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా నవోదయ, సైనిక్‌, ఆర్‌ఎంఎస్‌ పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తూ విద్యార్థులకు ఎటువంటి వసతులు కల్పించకుండా ఒక ఇంటి గదిలోని హాలులో దాదాపు 70 నుండి 100 మంది విద్యార్థులను కిక్కిరిసేలా కూర్చోబెట్టి దాదాపు 30 సంవత్సరాల నుండి అనుమతులు లేకుండా కోచింగ్‌ సెంటర్‌ నడుపుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా అందించకుండా ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థు లను కోచింగ్‌ సెంటర్లో చేర్చుకున్నారని వారి అడ్మిషన్లు, హాజరు ఎక్కడు న్నాయో తెలపాలన్నారు. ఎటువంటి ఫ్యాకల్టీ లేకుండా, కనీసం ప్రత్యేక బిల్డింగ్‌ లేకుండా, ఎమర్జెన్సీ సేఫ్టీ పరికరాలను కూడా ఉపయోగించకుండా కోచింగ్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు. విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, అలా విద్యను వ్యాపారంగా చేస్తున్న వారిపై తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్‌ పురుషోత్తం స్పందించి కోచింగ్‌ సెంటర్‌పై చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కోచింగ్‌ సెంటర్‌ పై చర్యలు తీసుకోని పక్షంలో సోమవారం కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపునిస్తామని, అధికారులు ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలపాలని కలెక్టర్‌ను కోరుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గౌరీశంకర్‌, చంగయ్య, పిడిఎస్‌యు నాయకులు సుమంత్‌, హరి పాల్గొన్నారు.