Jul 07,2022 22:51

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సివిఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను యథావిధిగా కో ఎడ్యుకేషన్‌ కళాశాలగా కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు, తలిదండ్రులు, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్తంగా రెండవ రోజు కళాశాల వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. జి.వో. నెంబర్‌ 85ను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈసందర్భంగా ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జి.వో. నెంబర్‌ 85 పేరిట రాష్ట్రంలో ఉన్న 25 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను మహిళా కళాశాలలుగా మారుస్తూ ప్రభుత్వం జివో విడుదల చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మహిళా కళాశాలగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జివో తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో రానున్న కాలంలో తల్లిదండ్రులు, విద్యార్థులతో కలసి పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. కళాశాలలో పేద మద్య తరగతి వర్గాలకు చెందిన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలకు చెందిన విద్యార్థులు సుమారు రెండువేల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. ఇటువంటి కళాశాలను ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జివోలు పేరుతో విద్యా వ్యవస్థను మొత్తం పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని యథావిధిగా కో ఎడ్యుకేషన్‌ కళాశాలగా నడపాలన్నారు. ఒకవేల మహిళా కళాశాల అవసరమైతే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మరో కళాశాలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి బాలురకు అడ్మిషన్లు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల పేద విద్యార్థుల చదువు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. సుమారు మూడు గంటలకొపైగా ఆందోళన చేస్తున్న ఒక్క అధికారి కూడా రాలేదన్నారు. ఇప్పటికైనా కళాశాలను కో ఎడ్యుకేషన్‌ కళాశాలగా ఉంటుందని ప్రకటించాలన్నారు. ఈకార్యక్రమంలో విజయవాడ నగర ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు భార్గవ్‌, లక్ష్మారెడ్డి, మన్మధ, రిజ్వాన్‌, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.