Sep 24,2023 18:19

దీక్షలు చేస్తున్న ముస్లీంలు

ప్రజాశక్తి-కందుకూరు :ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జీవితమంతా మాయలు, మోసాలేనని, అతనికి దోచుకోవటం దాచుకోవడం తప్ప ప్రజలపై ప్రేమ లేదని కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ కందుకూరులోని టిడిపి కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 11వ రోజుకు చేరాయి. ముస్లిం మైనారిటీ కమిటీ, నూర్‌ భాషా నేతల ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. ముందుగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం, ముస్లిం సోదరులతో కలిసి నాగేశ్వరరావు దీక్షలల్లో కూర్చున్నారు. దీక్ష ముగింపు సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, వైసిపి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అవినీతి గురించి ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. ఇసుక, గ్రావెల్‌, మద్యం, రేషన్‌ బియ్యం దందాలు, వ్యవసాయ మీటర్లు, జగనన్న కాలనీలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటిలోనూ అవినీతి కనిపిస్తుందన్నారు. అబద్ధపు హామీలతో ముస్లింల ఓట్లు వేయించుకున్న జగన్మోహన్‌ రెడ్డి, నాలుగేళ్లలో మైనారిటీలకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు, నియోజకవర్గ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ నాయబ్‌ రసూల్‌, రాష్ట్ర మైనారిటీ సెల్‌ అధికార ప్రతినిధి షేక్‌ రఫీ, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు షేక్‌ మున్నా, పట్టణ మైనారిటీ సెల్‌ అధ్యక్షుడు షేక్‌ సలాం, ముస్లిం మైనారిటీ నాయకులు షేక్‌ ఫిరోజ్‌, మాబాషా, ఖలీల్‌, నాగూర్‌, రూబీ, జియావుద్దీన్‌, గౌస్‌, కరీం, జిల్లెల్లమూడి మస్తాన్‌, తిరుపాలు, బాబు, రహంతుల్లా ఉన్నారు.