మదనపల్లె అర్బన్ : కేంద్రం ఎప్పటి మాదిరిగానే 2023-24 బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందని, రాష్ట్ర ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదాకు మొండిచేయి చూపించి బిజెపి ద్రోహం చేస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం మదనపల్లె మార్కెట్ యార్డు ఎదురుగా కదిరి రోడ్డు మీద సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి డౌన్ డౌన్, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి, కడప-బెంగళూరు రైల్వేలైన్‌కు నిధులు కేటాయించాలి, రాష్ట్రానికి నిధులు పెంచాలని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాధ్యత తన మొసలి కన్నీరు కార్చిన ప్రధాని గత ఎనిమిది సంవత్సరాలుగా ద్రోహం చేస్తూనే వచ్చారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని అదానికి బిజెపి తాకట్టుపెట్టిందని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటి ఊసెత్తకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, అన్నమయ్య జిల్లా వంటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తం 62 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్ అన్నమాటనే ఉఛరిేంచకపోవడం దారుణమన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కర్ణాటకు కొత్తగా ప్రత్యేక కేటాయింపులు చేసిన కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. రాజధాని అభివ ద్ధిని నిర్లక్ష్యం చేసిందని, కడప బెంగళూరు రైల్వేలైన్‌కు మొండిచేయి చూపిందని విమర్శించారు. ఉపాధి హామీ కేటాయింపుల్లో సగం కోతపెట్టడం, ఆహారం, ఎరువులపై సబ్సిడీలను ఘోరంగా కుదించడం వల్ల సామాన్యులు తీవ్ర ఇక్కట్ల పాలవుతారని ఆవేదన చెందారు. విద్యుత్ సంస్కరణలు, పట్టణాల్లో యూజర్ ఛార్జీల వంటివి జనం నడ్డి విరుస్తాయని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నామమాత్రపు కేటాయింపులు చేసిందని తెలిపారు. రాష్ట్రానికి తీవ్ర నిరాశకలిగించిన కేంద్ర బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం వ్యతిరేకించాలని కోరారు. సిపియం పట్టణ కార్యదర్శి డి. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపియం నాయకులు నాగరాజు, సురేంద్ర, వెంకటేష్, రమణ, కందస్వామి తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట అర్బన్ : పట్టణంలోని గాంధీజీ విగ్రహం ఎదుట సిఐటియు, ఎస్‌ఎఫ్‌ఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం కేంద్ర బడ్జెట్ బిల్లుకు నిరసన తెలిపి బడ్జెట్ పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కార్యదర్శి సి.రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను నిరాశపరిచే విధంగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమన్నారు. పేద, మధ్య తరగతి వారికి ఈ బడ్జెట్ నిరాశ పరిచిందన్నారు. కార్యక్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తల్లికాలమ్మని, కెవిపిఎస్ జిల్లా కన్వీనర్ పెంచలయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, కార్తీక్, ఉపేంద్ర, అఖిల్, వీఆర్‌ఏల సంఘం జిల్లా నాయకులు శంకర్, మణి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు లక్ష్మీదేవి పాల్గొన్నారు.










