చండీఘర్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ 4.8 శాతం పోలింగ్ నమోదైంది. ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోతున్న కాంగ్రెస్ పంజాబ్ ఎన్నికలు ఎంతో ప్రతిష్టాత్మకం. కాగా, వ్యవసాయ చట్టాల తెచ్చి.. అన్నదాతల ఆగ్రహాన్ని చవిచూసిన బిజెపి.. తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సారి అధికారాన్ని చేపట్టాలనే లక్ష్యంతో కేజ్రీవాల్ నేతృత్వంలోని రంగంలోకి దిగుతోంది. ఇక శిరోమణి అకాలీదళ్- బిఎస్‌పి కూటమి కూడా గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమైంది. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 1,304 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడుతున్నారు. రాష్ట్రంలో మొత్తంగా 2,14,99,804 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.. ఓటింగ్ కోసం 24,689 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఇందులో 2,103 బూత్‌లను సమస్యాత్మకంగా గుర్తించారు. పోలింగ్ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో మూడవ దశలో భాగంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు 8.15 శాతం పోలింగ్ నమోదైంది. 16 జిల్లాల్లోని 59 నియోజవర్గాల్లో నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. మాజీ ముఖ్యంమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్న కర్హాల్ నియోజవర్గం కూడా మూడో దశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో ఉంది. హత్రాస్, ఫిరోజబాద్, , కాస్‌గంజ్, మెయిన్‌పురి, ఫర్రూఖ్‌బాద్, కన్నౌజ్, ఇతవాహ్, ఔరైయా, కన్పూర్ దెహత్, కన్పూర్‌నగర్, జలౌన్, ఝాన్సీ, లలిత్‌పూర్, హమిర్‌పూర్, మహోబా జిల్లాలో పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 2.15 కోట్ల మంది ఓటర్లు ఆదివారం తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోడీ ఓటర్లనుద్దేశించి ట్వీట్ చేశారు. భారీగా ఓటర్లు, ముఖ్యంగా యువత, మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారంతా పెద్ద సంఖ్యలో ఓట్లు వేయాలని కోరారు.










