Apr 08,2022 08:03

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేసిన నేపథ్యంలో ఇందులో ఉన్న వారే నలుగురు లేదా ఐదుగురు వచ్చే మంత్రివర్గంలోనూ కొనసాగుతారని, అదీ కులసమీకరణల్లో ఆయా కులాల్లో ప్రత్యామ్నాయం లేని వ్యక్తులకు అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. శాసనసభా వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంధ్రనాథ్‌ను మళ్లీ మంత్రులుగా తీసుకునే అవకాశమున్నట్లు తెలిసింది. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పట్టున్న బుగ్గనను మారిస్తే ఆర్థికపరమైన అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతుందని, అందువల్లే వారిని కొనసాగించొచ్చని సమాచారం. వీరితోపాటు ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, పలాస ఎమ్మెల్యే మత్స్యకార సామాజికవర్గం నుండి మంత్రిగా ఉన్న సీదిరి అప్పలరాజు, ఆలూరు ఎమ్మెల్యే, వాల్మీకి బోయ సామాజికవర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం కూడా మంత్రివర్గంలో కొసాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎస్‌సి సామాజికవర్గంలో ఓ బలమైన వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలం సురేష్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఆయన్నే కొనసాగించొచ్చని తెలిసింది. తాడికొండ నుండి ఎమ్మెల్యే శ్రీదేవి, మడకశిర నుండి తిప్పేస్వామి ఉన్నప్పటికీ వీరిద్దరితో పోల్చుకుంటే అనుభవం రీత్యా సురేష్‌వైపే మొగ్గుచూపున్నట్లు తెలిసింది. తొలి నుండీ సిఎం కుటుంబానికి అంటిపెట్టుకుని ఉండటం, ఉన్నత విద్యావంతుడు కావడంతో ఆయన్నే కొనసాగించే అవకాశముంది. మత్స్యకార సామాజికవర్గంలో పొన్నాడ సతీష్‌ మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో సీదిరి అప్పలరాజును తగ్గిస్తే పొన్నాడ సతీష్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. కోనసీమ నుండి కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే పొన్నాడను పక్కనబెట్టాల్సి ఉంటుంది. దీంతో సీదిరి అప్పలరాజును కొనసాగించొచ్చు. ఉభయగోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను కొనసాగించొచ్చనే మరో ప్రచారమూ జరుగుతోంది. సీదిరి అప్పలరాజు, వేణుగోపాలకృష్ణ మధ్యలోనే మంత్రులుగా వచ్చిన వారు కావడంతో ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. వైశ్య సామాజిక వర్గం నుండి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కొనసాగుతు న్నారు. ఆయన్ను తొలగిస్తే విజయనగరం ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామిని మంత్రిని చేయాల్సి ఉంటుంది. తూర్పుకాపు సామాజికవర్గం నుండి బొత్స కుటుంబంలో ఒకరిని మంత్రిగా తీసుకుంటే కోలగట్లకు అవకాశం ఉండకపోచ్చు. అప్పుడు అనివార్యంగా వెలంపల్లిని మంత్రిగా తీసుకునే అవకాశం ఉందనే ప్రచారమూ జరుగుతోంది. కమ్మ సామాజికవర్గం నుండి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, వైసిపి అనుబంధ సభ్యుడిగా ఉన్న వల్లభనేని వంశీమోహన్‌ ఉన్నారు. అయితే ప్రతిపక్షనేత చంద్రబాబును గట్టిగా తిట్టగలిగే వ్యక్తిగా నానికి పేరుంది. కృష్ణాజిల్లా నుండి గౌడ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సి వస్తే ఈ జిల్లా నుండి నానికి, వంశీకి అవకాశం ఉండకపోవచ్చు. బొత్స కుటుంబానికి మంత్రి పదవి ఇస్తే వెలంపల్లి మంత్రిగా కొనసాగే అవకాశం ఉండటంతో వసంత కృష్ణప్రసాదుకూ అవకాశం ఉండకపోవచ్చు. మంత్రి వర్గం విస్తరణ నేపథ్యంలో కొద్దిరోజులుగా ఎక్కడ విన్నా కులసమీకరణలపైనే చర్చ జరుగుతోంది.