దుర్మార్గమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్, మే మాసాల్లో దేశమంతటా వీధి నిరసనలు హోరెత్తాయి. పాఠశాలలు, తాగు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, భూ సంస్కరణలు అమలు చేయాలని, ప్రజాస్వామ్య అవకాశాలను విస్తరింపజేయాలని, ఆఫ్రో కొలంబియన్లను, దేశీయ తెగలను సమానంగా చూడాలని వారు నినదించారు. నిరంతరంగా వీధి పోరాటాలు కొనసాగడంతో డ్యూక్ తన విధానాల్లో కొన్నిటిని ఉపసంహరించుకున్నాడు. కొలంబియాలో రాజకీయ సమీకరణల్లో మార్పులకు ఇవి నాంది పలికాయి.
కొలంబియా వామపక్ష ఎన్నికల సంకీర్ణ కూటమి (పాక్టో హిస్టోరికో పోర్ కొలంబియా) 2022 మార్చి 13న తన ప్రైమరీస్ ఎన్నికలు నిర్వహించింది. పాక్టో హిస్టోరికో (చారిత్రిక ఒడంబడిక) అనేది వామపక్ష అతివాద, కమ్యూన్స్, టోడోస్ సోమోస్ వంటి మధ్యేవాద వామపక్షాలు, కొలంబియా కమ్యూనిస్ట్ పార్టీతో సహా ఇరవై రాజకీయ పార్టీలతో ఏర్పాటైన సంకీర్ణ కూటమి. 80 శాతానికి పైగా ఓట్లతో ప్రైమరీస్‌లో నెగ్గిన గుస్తావో పెట్రో సారథ్యంలోని లెఫ్ట్ ఫార్మేషన్ హ్యూమన్ పార్టీ ఈ కూటమిలో ప్రధాన భాగస్వామి.
1980లలో ఎం-19 గ్రూప్‌తో గెరిల్లాగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పెట్రో, 2012 నుంచి రెండేళ్ల పాటు కొలంబియా రాజధాని బొగోటాకు మేయర్‌గా ఉన్నారు. 2018లో సెనేటర్‌గా ఎన్నికయ్యారు. కొలంబియా లోని వామపక్ష శక్తులన్నీ పాక్టో హిస్టోరికోలో చేరాయి. మే 29న జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు పాక్టో హిస్టోరికో కూటమి తరపున పెట్రోను ఎన్నుకున్నారు. మేలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పెట్రో గెలిస్తే, కొలంబియాలో మొట్ట మొదటి వామపక్ష ప్రభుత్వం ఏర్పడుతుంది.
ఐదుగురు వ్యక్తులు బరిలో ఉన్న అధ్యక్ష ఎన్నికల్లో పెట్రో పాక్టో హిస్టోరికో 50 శాతానికి మించిన ఓట్లతో మొదటి రౌండ్ లోనే గెలుపొందే అవకాశముందని, రెండవ రౌండ్ ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చని ఒపీనియన్ పోల్స్ కోడై కూస్తున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు ఇవాన్ డ్యూక్ ఎన్నికలలో పోటీ చేసేందుకు కొలంబియా చట్టం అనుమతించకపోవడంతో ఆస్కార్ జులుగాను డ్యూక్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఉక్కు తయారీ కుటుంబానికి చెందిన వారసుడు, బ్యాంకింగ్ లోకి వెళ్లి రాజకీయాల లోకి వచ్చిన జులుగా అవినీతిపరుడిగా పేరొందాడు. అత్యంత భ్రష్టు పట్టిన మితవాద నాయకుడు అల్వారో ఉరిబే ప్రభుత్వంలో మంత్రిగా గతంలో పని చేశాడు. అధ్యక్ష ఎన్నికల రేసులో అతను బాగా వెనుకబడి ఉన్నట్లు ఒపీనియన్ పోల్స్ తెలిపాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, జులుగా గెలిచే అవకాశమే లేదని ఎన్నికల విశ్లేషకులు ఢంకా బజాయిస్తున్నారు. ఇతర మితవాద పార్టీల అభ్యర్థులు ఫెడరికో గుటిరెజ్, ఇంగ్రిడ్ బెటాన్ కోర్ట్‌లకు 5 శాతం ఓట్లు వస్తే గొప్ప అంటున్నారు.
ఇటీవల ప్రైమరీస్‌తో పాటు, కొలంబియా ప్రజలు కొత్త పార్లమెంటుకు (సెనేట్, ప్రతినిధుల సభ రెండింటికీ) కూడా కొలంబియా ప్రజలు ఓటు వేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పాక్టో హిస్టోరికో గణనీయమైన విజయాలు సాధించింది. రెండు ప్రధాన సాంప్రదాయక పార్టీలను అది పక్కకు నెట్టి కొలంబియా రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. రైతు ఉద్యమానికి చెందిన రాబర్ట్ దాజా గువేరా, ఆదిమ జాతుల ఉద్యమ నేత ఐడా క్విల్కూ గెలుపొందిన ప్రముఖుల్లో ఉన్నారు. పార్లమెంటులో పూర్తి మెజార్టీ ఎవరికీ లేనందున భూ సంస్కరణ చట్టాల ఆమోదం అంత తేలిక కాకపోవచ్చు.
రాడికల్ ఎజెండా
తాను గెలిస్తే 1948 నుండి హింసతో సతమతం అవుతున్న దేశాన్ని ప్రగతి పథంలో తిరిగి నడిపిస్తానని పెట్రో హామీ ఇచ్చాడు. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కార్మిక హక్కులను పటిష్టం చేస్తానని, గణనీయ సంఖ్యలో ఉన్న నల్లజాతి, ఆదిమ జాతులకు సమాన హక్కులు కల్పిస్తానని వాగ్దానం చేశాడు.
కొలంబియాలో డ్రగ్స్ మాఫియాలు గైటన్‌ను హత్య చేయడంతో అదొక హింసావలయానికి దారితీసింది. మొదట బొగోటాజోతో మొదలైన అల్లర్లు 2016లో క్యూబా లోని హవానాలో శాంతి ఒప్పందం కుదిరే దాకా కొనసాగాయి. రివల్యూషనరీ సాయుధ దళాలు (ఫార్క్)కి, ప్రభుత్వానికి మధ్య ఈ శాంతి ఒప్పందం కుదిరింది. ఫార్క్ అనేది ఇప్పుడు పెట్రో సారథ్యంలోని పాక్టో హిస్టోరికోలో కీలక భాగస్వామిగా ఉంది. భూమి, శ్రమ, గౌరవంపై తన ఆధిపత్యాన్ని వదులుకోవడానికి కొలంబియాలోని సంపన్నవర్గం సిద్ధంగా లేదు. గైటన్ హత్యే ఇందుకు నిదర్శనం. గైటన్ ఒక ఉదారవాది. అమెరికన్ సామ్రాజ్యవాదం, కొలంబియా లోని డ్రగ్స్ మాఫియా కుమ్మక్కయి దుష్ట యుద్ధాలకు తెగబడుతుంటే, వాటిని చీల్చి చెండాడాలని నిశ్చయించుకుంటాడు. పెట్రో ఎజెండా కొత్తది కాదు, ఏడు దశాబ్దాలుగా కొలంబియాను పట్టి పీడిస్తున్న సమస్యనే ఆయన లేవనెత్తాడు.
1948 నాటి నిరసనలు ఒక్కోసారి ఈ హింసా వలయంలో పునరావృతమవుతున్నాయా అని అనిపిస్తోంది. గత సంవత్సరం అధ్యక్షుడు డ్యూక్ కోవిడ్ మహమ్మారి వల్ల తలెత్తిన సంక్షోభ భారాలను రైతాంగం పైన, శ్రామికవర్గం పైన నెట్టేసేందుకు యత్నించాడు. 2016 హవానా శాంతి ఒప్పందానికి తూట్లు పొడిచాడు. దీంతో కొలంబియన్లలో అసంతృప్తి చెలరేగింది. దుర్మార్గమైన ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఏప్రిల్, మే మాసాల్లో దేశమంతటా వీధి నిరసనలు హోరెత్తాయి. పాఠశాలలు, తాగు నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని, భూ సంస్కరణలు అమలు చేయాలని, ప్రజాస్వామ్య అవకాశాలను విస్తరింపజేయాలని, ఆఫ్రో కొలంబియన్లను, దేశీయ తెగలను సమానంగా చూడాలని వారు నినదించారు. నిరంతరంగా వీధి పోరాటాలు కొనసాగడంతో డ్యూక్ తన విధానాల్లో కొన్నిటిని ఉపసంహరించుకున్నాడు. కొలంబియాలో రాజకీయ సమీకరణల్లో మార్పులకు ఇవి నాంది పలికాయి. డ్యూక్ అనుసరించిన పొదుపు చర్యలకు వ్యతిరేకంగా 2019 -2020లో మొదలైన పోరాటాల వెల్లువకు కొనసాగింపే 2021లో నిరసనల వెల్లువ. దీనికన్నా ముందు 2018లో విద్యార్థుల తిరుగుబాటు పెద్దయెత్తున సాగింది. విద్యా రంగంలో పొదుపు చర్యలు, తీవ్ర రూపం దాల్చిన నిరుద్యోగం, వెనుకబాటుతనం వంటి వాటికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉవ్వెత్తున ఉద్యమించారు. ఈ ఆందోళనలు నెలల తరబడి సాగాయి. వీటికి ముందు అంటే 2013-2014లో వ్యవసాయ రంగంలో మహత్తర పోరాటాలు ప్రారంభ మయ్యాయి. 2016 వరకు అవి కొనసాగాయి. ఈ ప్రజా పోరాటాలు కార్మిక, కర్షక వర్గాలను ఏకతాటిపై నిలిపాయి. ఆఫ్రో కొలంబియన్లు, దేశీయ తెగల గ్రూపులు ఈ పోరాటాల ద్వారా ఏకతాటిపైకి వచ్చాయి. పాక్టో హిస్టోరికో ప్రతినిధుల ఎన్నికలోను, పెట్రో ఎన్నికలోను వీరు కీలక పాత్ర పోషించారు. పెట్రోకు ఈ వర్గాలే పునాదిగా నిలిచాయి. ఎన్నికల ప్రచారం ఉధృతమయ్యే కొద్దీ ఇప్పుడు టేబుల్‌పై ఉన్న రాడికల్ ఎజెండాకు భిన్నంగా కొన్ని రాయితీలు ఇవ్వక తప్పని స్థితి రావచ్చు.
ధనిక దేశాల కుట్రలు
పెట్రో తరచూ ఇస్తున్న ఎన్నికల హామీల్లో ఒకటి కొలంబియా చమురు పరిశ్రమను మూసివేయడం. కొలంబియా ఎగుమతుల్లో సగానికి పైగా శిలాజ ఇంధనాల నుండి (57 శాతం పెట్రోలియం నుంచే) ఉన్నాయి. కొలంబియా బొగ్గులో దాదాపు 92 శాతం వరకు ఎగుమతి చేయబడుతోంది. కొలంబియా ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద బొగ్గు ఉత్పత్తిదారు (2021లో 31.5 మిలియన్ టన్నులు). ఈ రంగంలో ప్రధానంగా కెనడా, అమెరికా కంపెనీలు ఆధిపత్యం చలాయిస్తున్నాయి. తాను అధికారంలోకి వస్తే వీటిని జాతీయం చేస్తానని పెట్రో చెప్పాడు.
రానున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అమెరికా ఇప్పటికే నానాయాగీ చేస్తోంది. 2022 ఫిబ్రవరి ప్రారంభంలో అంటే, ప్రైమరీ ఎన్నికలు జరగడానికి ముందు అమెరికా తన విదేశాంగ శాఖ సహాయ మంత్రి విక్టోరియా నూలాండ్‌ను ఉన్నత స్థాయి వ్యూహాత్మక భద్రతా చర్చల కోసం సమావేశాల కోసం బొగోటాకు పంపింది. ఫార్క్, కొలంబియన్ లెఫ్ట్‌కు వ్యతిరేకంగా యుద్ధం సాగిస్తున్న పారామిలిటరీ గ్రూపులకు, కొలంబియన్ ప్రభుత్వానికి అమెరికా 'ప్లాన్ కొలంబియా' అనే మెకానిజం ద్వారా నిధులు అందజేస్తున్నది. 2014లో ఉక్రెయిన్‌లో ప్రభుత్వాన్ని కూలదోయడంలో నూలాండ్ పాత్ర తెలిసిందే. అప్పటి ఉక్రెయిన్ అధ్యక్షునికి వ్యతిరేకంగా నిరసనలను ఎగదోయడంలో ఆమె చురుగ్గా పాల్గొన్నారు. కీవ్ లోని అమెరికా రాయబారికి ఫోన్ చేసి ఉక్రెయిన్ తదుపరి అధ్యక్షునిగా ఎవరు ఉండాలో ఆదేశాలిచ్చారు. తరువాత ఆమె ప్రెస్‌తో మాట్లాడుతూ, ఎన్నికలను తారుమారు చేయడానికి అవకాశమున్నందున బయటి స్వార్థపర శక్తుల నుండి మనం (ఎన్నికలు) రక్షించాలని నీతులు వల్లించారు.
ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆయుధాలతో ముంచెత్తడం ద్వారా కొలంబియాలో తమ ప్రయోజనాలను కాపాడుకోడానికి నూలాండ్, అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నాయి. కొలంబియన్ కులీనులతో కలసి వారు రష్యా, ఇరాన్ వెనిజులాపై నిందా ప్రచారానికి పూనుకున్నారు. వ్యాపారవేత్త, కొలంబియా రక్షణ మంత్రి అయిన డీగో మలోనా మాట్లాడుతూ, వెనిజులా సైన్యానికి రష్యా ఇరాన్ నుండి మద్దతు, సాంకేతిక సాయం లభిస్తుందని ఆరోపించారు. నూలాండ్ బొగోటా లోని బ్లూ రేడియోతో మాట్లాడుతూ, వెనిజులా సరిహద్దులో రష్యన్ల కదలికలు పెరగడం తమకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఇటువంటి ప్రకటనలు చేసేటప్పుడు తగిన ఆధారాలు చూపాలి. కానీ, అవేమీ అవసరం లేదన్నట్లుగా వారు మాట్లాడతారు. వారి ప్రచార బాకాలు కొలంబియాలో వామపక్షాలను, పెట్రోను లక్ష్యంగా చేసుకుని విష ప్రచారం సాగిస్తున్నాయి.
కొలంబియాలో ఉన్నప్పుడు, కొలంబియా పోలీసులకు మానవ హక్కుల్లో శిక్షణ పేరుతో 80 లక్షల డాలర్లు సమకూర్చారు. జూన్ 2021లో, హ్యూమన్ రైట్స్ వాచ్ 'నిరసనకారులపై పోలీసుల అకృత్యాలకు అడ్డు అదుపులేదని పేర్కొంది. మలోనా పర్యటనలో దీనికి సంబంధించిన ఊసే లేదు. వెనిజులా-కొలంబియన్ సరిహద్దు గురించి, వెనిజులా లోపల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గురించి ఆమె ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ప్రపంచంలో డెబ్బయి శాతానికి పైగా కొకైన్ కొలంబియా నుంచే అక్రమ రవాణా అవుతోందని అమెరికా ప్రభుత్వ నివేదికలే చెప్పాయి. ఈ మాఫియాతో ప్రభుత్వ ఉన్నతాధికారులకు, పారా మిలిటరీ దళాలకు, చివరికి జాతీయ పోలీసులకు గట్టి సంబంధాలున్నట్లు ఆ నివేదికలు చెబుతున్నాయి. అటువంటి వారినే అమెరికా అక్కున చేర్చుకుని దక్షిణ అమెరికాలో తన పన్నాగాలను సాఫీగా ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నది. కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో పెట్రో విజయాన్ని అడ్డుకోవడానికి అమెరికా పన్నుతున్న కుతంత్రాలను కప్పిపుచ్చుకోడానికి బయటి వారు కొలంబియా అధ్యక్ష ఎన్నికల్లో తల దూర్చుతున్నారన్న తప్పుడు ప్రచారాన్ని చేపట్టింది.
2008 డిసెంబర్ 16న, ఎడ్విన్ లెగార్డా తన భార్య ఐడా క్విల్‌క్యూకి కేటాయించిన కారులో వెళుతుండగా ముష్కరులు కాల్పులు జరిపారు. లెగార్డా అక్కడికక్కడే మరణించాడు. అయితే, సాయుధ దుండగుల అసలు లక్ష్యం ఐడా క్విల్క్యూ. కొలంబియా దేశీయ తెగలపై జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై ఐరాస మానవ హక్కుల మండలి నిర్వహించిన సమీక్షకు హాజరై ఆమె సాక్ష్యమిచ్చారు. మార్చి 13న లెగార్డా ఆమె కారులో లెగార్డే వెళ్తుండగా కొలంబియన్ సాయుధ దళాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో లెగార్డే చనిపోయారు. ఆ విధంగా ప్రాణాలతో బయటపడిన ఐదా క్విల్క్యూ. కొలంబియా సెనేట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. క్విల్క్యూ వంటి ఎందరో కార్యకర్తలతో కొలంబియా వామపక్షం నేడు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది.
( వ్యాసకర్త 'లెఫ్ట్ వర్డ్ బుక్స్' చీఫ్ ఎడిటర్ )
విజయ్ ప్రసాద్











