పెనుకొండ : పట్టణ సమీపంలోని అటవీ ప్రాంతంలో భార్యపై అనుమానంతో కన్న కొడుకును కడతేర్చిన తండ్రిని ఎట్టకేలకూ అరెస్టు చేసినట్లు డీఎస్పీ హుస్సేన్‌పీరా తెలిపారు. ఈమేరకు గురువారం సాయంత్రం పట్టణంలోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ రామగిరి మండలానికి చెందిన ఎరికల గంగరాజుకు మూడేళ్ల క్రితం మడకశిర మండలం శివాపురంలో నివాసం ఉన్న ఎరుకల నాగరాజు, లక్ష్మమ్మ మొదటి కుమార్తె కవితతో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు వికాస్ ఉన్నాడు. సుమారు సంవత్సరం వరకు రామగిరిలోనే భార్యతో కాపురం ఉన్నాడు. ఆ సమయంలో తన భార్య సరిగా మాట్లాడేది కాదని అనుమానం పెంచుకుని తరచూ గొడవ పడేవాడు. ఇందులో భాగంగా కుమారుడు వికాస్ తనకు పుట్టలేదని వాదిస్తూ ఉండేవాడు. ఈనేపథ్యంలో ఎలాగైనా వికాస్‌ని చంపేయాలని భావించిన గంగరాజు ఈనెల 20న తన భార్య పుట్టింటికి వెళఙ్ల కుమారుడిని తన మోటార్ సైకిల్‌పై తీసుకుని పెనుకొండ ఫారెస్ట్ ఏరియా ఉలవల గుట్ట వద్దకు వచ్చి గొంతు నులిపి చెట్ల పొదల్లో పడేసి వెళ్లాడు. కొడుకును తానే చంపినట్లు ఈనెల 27న అన్న రవికి చెప్పాడు. ఆయన విషయాన్ని గంగరాజు భార్య కవితకు చెప్పాడు. వెంటనే ఆమె పెనుకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈనేపథ్యంలో నిందితుడు గంగరాజు గురువారం మధ్యాహ్నం రామగిరి నుండి ఎన్‌ఎస్‌గేట్‌కు వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మడకశిర, గోరంట్ల సీఐలు, పెనుకొండ ఎస్‌ఐ రమేష్ బాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ హుస్సేన్‌పీరా










