మట్టి దొరకకపోవడం ఓ కారణం
ఉపాధి కూలీలుగా మారుతున్న వైన్యం
ప్రజాశక్తి-రాయచోటి: వేసవి ఎండల తీవ్రతకు మనిషి దాహం వేసినప్పుడు సరాసరి వెళ్లేది మంచినీటి కుండవద్దకే. అందుకే మట్టికుండను పేదవాని ఫ్రిజ్ అంటారు. నేటి ఆధునిక సమాజంలో మట్టికుండ కనుమరుగైపోతుంది. ఈ వత్తిపై ఆధారపడిన శాలివాహనుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యారు. వేసవి వచ్చిందంటే మట్టి కుండలకు చాలా గిరాకీ ఉండేది. శాలివాహనులు కుండలు తయారు చేసి ఆర్థికంగా కొంత బలపడేవారు. వేసవిలో సంపాదించుకున్న డబ్బులు ఏడాది పాటు వాడుకుంటూ వర్షాకాలం, చలికాలంలలో కూలీ నాలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. గతంలో పేద మధ్యతరగతి ప్రజలతో పాటు ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా మట్టి పాత్రలపై మక్కువ చూపేవారు. మార్కెట్లోకి ప్లాస్టిక్ వస్తువులు, వాటర్ క్యాన్లు, ఫ్రిజ్‌లు విరివిగా రావడంతో మట్టి కుండలు వాడకం కాలక్రమేనా తగ్గిపోతుంది.
మట్టి కుండలో ఉండే నీరు చల్లగా రుచికరంగా ఎంతో దాహాన్ని తీరుస్తాయి. నేడు మట్టి కుండలు కొనేనాధుడే కరువయ్యారు. మట్టి కుండలకు గిరాకీ ఉండే వేసవిలో కూడా అంతంతమాత్రంగా కుండలు కొనుగోలు ఉండడంతో ఈ వత్తిపై ఆధారపడిన ఎన్నో శాలివాహనుల జీవితాలు ఆగమ్యాగోచరంగా మారాయి. ప్రభుత్వం ఈ వత్తిదారులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం ఆధుకోకపోవడం వల్ల కులవత్తులు నేడు కనుమరుగవుతున్నాయి. చేతి వత్తుల పనివారికి ప్రోత్సహించి వారి వత్తులు కనుమరుకాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతో ఉంది. లేకుంటే రాబోవు రోజుల్లో మట్టి కుండ అని బొమ్మల ద్వారా రాబోవు తరాలకు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కావలసిన బంకమట్టి గతంలో దొరికేది. నేడు ఉన్న మట్టిని కూడా ఎక్కడపడితే అక్కడ గహ నిర్మాణాలకు, లేఔట్లకు తరలించడం వల్ల మట్టి కూడా కరువవుతోంది. కుమ్మరులు మట్టికుండల తయారీ కావలసిన మట్టి దొరకకపోవడంతో చేసేదిలేక నేడు చాలా మంది ఉపాధి పని కూలీలుగా మారారు.
అరకొరగానే చలివేంద్రాలు
ఎండాకాలం వచ్చిందంటే చాలా మంది ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్లు, ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలలో మట్టికుండలతో ఉప్పు బానులతో మంచినీటి చలివేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రజల దాహాన్ని తీర్చుతుంటారు. గతంలో ఎక్కడపడితే అక్కడ చలివేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా చలివేంద్రాలను జిల్లాలో రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గం, మండల కేంద్రలలో కూడా ఏర్పాటు చేస్తున్నారు. మట్టి కుండల తయారీ గతంలో కంటే నేడు కొంత తగ్గింది. ఎందుకంటే కుండలు కొనే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో చేసేవారు కూడా కుండలు అమ్ము పోకపోవడంతో ఈ కుండల తయారీకి ముగ్గు చూపకపోవడం గమనార్హం.
కుండలకు కొన్నిచోట్ల గిరాకీ
మట్టి కుండలకు కొన్ని చోట్ల గిరాకీ బాగుంటుంటోంది. మట్టి కుళాయి కుండ రూ.250 నుంచి 350, సాధారణ కుండ రూ.150 నుండి 350, వాటర్ బాటిల్ రూ.200, హుండీ రూ.50, పూల కుండి రూ.150, మట్టి ప్రమిదలు, మూకుళ్ళు, ఇతర మట్టి సామగ్రిని అమ్ముతున్నారు. అంగళ్ళ, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాల నుంచి తెచ్చుకొని మారుబేరాలకు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. నచ్చకపోతే ఆకలి కేకలు ఉన్నట్లుగా ఈ వ్యాపారం సాగుతుందన్నారు. కొనేవారు వస్తే ఆ అమ్ముడుపోతే నాలుగు రూపాయలు ,తమకు వస్తుందని అమ్ముడుపోకపోతే ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ అమ్మకం దా ర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందిని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మట్టి పాత్రల వాడకం తగ్గింది
మట్టితో తయారు చేసిన పాత్రలు వాడకం బాగా తగ్గింది. గతంలో మట్టి కుండలకు వ్యాపారం బాగా ఉండేది. 20 సంవత్సరాలుగా మట్టి కుండల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాను. రానురాను వ్యాపారం తగ్గుముఖం పడుతుంది. రోజంతా ఇద్దరు మనుషులు వ్యాపారం చేస్తున్నాం. రోజంతా వ్యాపారం జరిగితే ఖర్చులు పోను రూ.500 నుండి 800 వరకు వస్తుంది. ప్రభుత్వం కులవత్తి చేసే వారందరికీ ఆర్థిక సాయం అందించాలి.
- బాలయ్య, మట్టి కుండల వ్యాపారి, రాయచోటి.










