ప్రత్యామ్నాయ పంటలపై మక్కువ చూపిస్తున్న రైతన్నలు
ఇటు రైతులకు, అటు రీలర్లకు నష్టాలే
దారుణంగా మారిన డీలర్ల పరిస్థితి
ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్: దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచంలోనే ఇటు పంటలు కాని అటు వస్తువుల ధరలు కాని విపరీతంగా పెరుగుతున్నాయి. పండించిన పంటలకు గిట్టు బాటు ధరలు లేక ప్రత్యామ్నాయ పంటలపై రైతులు మక్కువ చూపిస్తున్నారు. గతంలో మదనపల్లె డివిజన్‌లోని పుంగనూరు,రామసముద్రం, పలమనేరు, కుప్పం, వీ.కోట, తంబళ్ళపల్లి, ములకలచెరువు, చౌడేపల్లి, సోమల, సదుం, కలికిరి, పీలేరు తదితర ప్రాంతాలలో మల్బరి సాగు విపరీతంగా ఉండేది. గత 8 సంవత్సరాల క్రితం మదనపల్లె పట్టుగూళ్ళ మార్కెట్‌కు టన్నుల పట్టుగూళ్ళ వస్తుండేవి. అయితే ఇప్పుడు మరీ దారుణంగా కేజీలకే పరిమితమైయిందంటే మల్బరీ సాగు చేసే రైతులు పూర్తిగా తగ్గిపోయారు.దీంతో మల్బరీసాగు చేసే రైతన్నలు నష్టాలు చవిచూడలేక మల్బరీ సాగు చేయడం మానేసి, టమోటా పంటపై రైతున్నలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రంలో మదనపల్లె, పలమనేరు, కుప్పం, కదిరి, ధర్మవరం, హిందూపురం, విజయవాడ ప్రక్కన హనుమాన్‌జంక్షన్ నందు పట్టుగూళ్ల మార్కెట్‌లు ఉన్నాయి. అందులో హిందూపురంలో అత్యధికంగా మార్కెట్‌కు పట్టుగూళ్లు వస్తాయి. ఆతర్వాత మదనపల్లె మార్కెట్‌కు వస్తాయి. మదనపల్లె మార్కెట్‌కు చిత్తూరు, నెల్లూరు, కడప, జిల్లాల నుండే కాకుండా తమిళనాడు రాష్ట్రం వేలూరు నుండి, కర్ణాటకరాష్ట్రం కోలార్‌జిల్లాల నుండి పట్టుగూళ్లను మార్కెట్‌కు రైతులు తీసుకువస్తున్నారు. గతంలో మదనపల్లె మార్కెట్‌కు 2టన్నులకు పైగా వచ్చిన పట్టుగూళ్లు నేడు వందల కేజీలకు పడిపోయింది. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. మల్బరీ సాగు చేసే రైతన్నలను ప్రభుత్వం విస్మరించడం. వారిని ఏవిధంగాను ఆదుకోకపోవడం, పట్టుగూళ్లకు కనీసం మద్దతు ధరలను కల్పించడంలోను ప్రభుత్వ వైఫల్యం అయిందని రైతులు ఆరోపిస్తున్నారు.
రీలర్ల పరిస్థితి దారుణం....ఇక పట్టుగూళ్లను మార్కెట్‌లో కొని వాటిని ఫ్యాక్టరీలకు తరలించి తరువాత విక్రయించే రీలర్ల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంటుంది. ఇందులో రెండురకాల పట్టుగూళ్ళు ఉన్నాయి. సిఎస్‌ఆర్, సిబి పట్టుగూళ్ళు మామూలుగా నాణ్యత కల్గిన పట్టుగూళ్లులో సిఎస్‌ఆర్ (తెల్లపట్టుగూళ్ళు) 6-7కేజీల నుండి ఒక కిలో సిల్క్‌దారం వస్తుంది. సిబి(పసుపు పట్టుగూళ్ళు)లలో 7-8కేజీల నుండి ఒక కిలో సిల్కు దారం వస్తుంది. అయితే ప్రస్తుతం నాణ్యమైన పట్టుగూళ్లు రాకపోవడంతో 8కిలోలపైగా పట్టుగూళ్లను వాడితేనే కిలో సిల్క్‌దారం వస్తుంది. దీనికి కూలీ, రవాణా ఖర్చులను కలిపితే కిలోరూ.3200 పైగా అవుతుంది. అయితే ప్రస్తుతం సిల్క్‌దారం కిలో విలువ ప్రస్తుతం రూ.3వేలు ఉంది. దీంతో రీలర్లు కూడా నష్టాల బాటలోనే నడుస్తున్నారు. నాణ్యతకల్గిన పట్టుగూళ్లు వస్తేనే తమకు గిట్టుబాటు అవుతుందని రీలర్లు తెలుపుతున్నారు.
చేనేతలకు కష్టమే... సిల్క్‌దారం విలువ రూ.3వేలకుపైగానే ఉండటంతో చేనేతకార్మికులకు నష్టాలు తప్పడం లేదు. పట్టుచీరలకు వర్కింగ్, లేబర్ ఎక్కువగా ఉండటం చీరల ధరలు పడిపోవడంతో వారు కూడా నష్టాలబాటలోనే నడుస్తున్నారు.
మల్బరీని సాగుచేసే రైతులు, పట్టుపరిశ్రమ అధికారులు, కార్మికులు, రీలర్లు, చేనేతకార్మికులు ఇలా రాష్ట్రంలో ఎన్నో లక్షలమంది ఈపరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. అలాంటి దానిపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా వారిని ఆదుకోనేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని పలువురు కోరుతున్నారు.










