కన్నుల పండువగా సద్ధి నివేదన
ప్రజాశక్తి-అల్లూరు : గంగమ్మ, కలుగోళమ్మ, పోలేరమ్మ ముగ్గురు అమ్మవార్ల ఉత్సవాల్లో భాగంగా మంగళవారం కన్నుల పండువగా పోలేరమ్మకు భక్తులు సద్దిని తీసుకువెళ్లారు. ఊరు పెద్దల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ప్రతియేటా ఘనంగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. సాంప్రదాయ దుస్తులలో మహిళలు పాల్గొని సద్ది నివేదన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. బిసికాలనీ వద్ద పోలేరమ్మ చెట్టుకు పూజలు అనంతరం గంగమ్మ, కలగోళమ్మ, మహాలక్ష్మమ్మలకు ముందుగా సద్దిని సమర్పించారు. అల్లూరు మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి సతీమణి శివప్రియ ఆధ్వర్యంలో 1001 కుండలతో అమ్మవారికి సద్దిని తీసుకువెళ్లి పోలేరమ్మ ఆలయం వద్ద భక్తులకు పంచిపెట్టారు. ఉత్సవాల్లో భాగంగా మేళ తాళాలు, తప్పెట్లతో పండుగ వాతావరణం నెలకొంది. ముగ్గురు అమ్మవార్లకు ఉత్సవాలు నిర్వహించే నేపథ్యంలో మాజీ ఎంఎల్‌ఎ సమక్షంలో వేకువజాము నుండి సాంప్రదాయ ప్రకారం పెదకాపు, పెదగొల్ల, పెద మాదిగ తదితరులతో కలసి ముందుగా మాతమ్మకు ప్రత్యేక పూజలు, కుమ్మరి సాంప్రదాయ ప్రకారం అఖండ ప్రతిష్ట, భైనాడి ఆచారాలు, కొమ్ము తదితర ఆచారాలతో ఉత్సవానికి శ్రీకారం చుట్టడంతో సంబరాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో ఆలయం వద్ద మహిళలు పొంగళ్లను ఏర్పాటు చేసి భక్తి పారవశ్యాన్ని చాటుకున్నారు. ఊరు పోలేరమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని పూలతో అందంగా ముస్తాబు చేయగా అనేకమంది అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులందరూ కలిసి పోతరాజుకు ప్రత్యేక పూజలు చేపట్టారు. పోలేరమ్మను దర్శించుకునేందుకు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కోలాటం, కులుకు భజన, భక్తులను అలరించేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.










