ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న రైల్వే కాంట్రాక్ట్ కార్మికులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. కనీస వేతనాలు కూడా అందుకోలేక పెరుగుతున్న ధరలతో అప్పులు చేస్తూ కుటుంబాలను పోషించుకునే దుస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుతో పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను కుధిస్తూ ఉపాధిని దూరం చేస్తుంది. దీంతో ఉన్నవారిపైనే తీవ్ర పని భారం పెరుగుతోంది. కాకినాడ పోర్ట్ స్టేషన్ పరిధిలో రైలు పెట్టెలు శుభ్రం చేసే వాళ్లు, అప్పర్ గేర్ కార్మికులు, ట్రైన్ లైటింగ్ రిపేర్ చేసే కార్మికులు, ఎసి రైలు పెట్టెలో బెడ్స్ మార్పు చేసేవాళ్ల, రన్నింగ్ రూమ్స్‌లో వంట పని చేసేవాళ్లు, రైల్వే బెడ్స్‌పై క్లాత్‌లు ఉతికేవాళ్లు, బయో టాయిలెట్స్ శుభ్రం చేసే వాళ్లు ఇలా వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా సుమారు 300 మంది, రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది పని చేస్తున్నారు.
ఏళ్ల తరబడి పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను కేంద్ర ప్రభుత్వం పర్మనెంట్ చేయడం లేదు. ఏటా రూ.కోట్లలో రైల్వే సంస్థకు ఆదాయాన్ని తెచ్చి పట్టటంలో వీరి పాత్ర ఎక్కువ. అయినా సౌకర్యాలు, వేతనాలు ఎక్కువగా ఇవ్వాలనే కారణంగా వీరి శ్రమను దోచుకుంటున్నారు. కనీసం సాధారణ సెలవులు కూడా అమలు కావడం లేదు. నిరంతరం పని చేయాల్సిందే. ఒక వేళ ఏదైనా అనారోగ్యంతో బాధ పడుతున్నా, తప్పనిసరి పరిస్థితుల్లో పనికి రాకపోయినా కాంట్రాక్టర్ల వేధింపులకు గురి అవుతున్నారు. పబ్లిక్ హాలిడే రోజున డ్యూటీ చేస్తే కనీసం డబల్ జీతం అయినా ఇవ్వాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. రెండేళ్లకు ఒకసారి కాంట్రాక్టర్ మారుతున్నప్పుడల్లా కొత్త కాంట్రాక్టర్ కార్మికుల్లో కొందరిని తగ్గించి కొంతమందినే పనిలోకి పెట్టుకుంటున్నారు. దీంతో ఉన్న వారిపైనే పని భారం ఎక్కువవుతుండగా అనేకమంది ఉపాధిని కోల్పోతున్నారు. గతంలో ట్రైన్ పెట్టెలు శుభ్రం చేసే పనిలో 150 మంది ఉండేవారు. ఇప్పుడు 90 మంది మాత్రమే పని చేస్తున్నారు. తమను రెగ్యులర్ చేసి అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, రెగ్యులర్ అయ్యే వరకూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కార్మికుల కోరుతున్నారు.
కనీస వేతనాలు నిల్
కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న విధానాల కారణంగా రోజురోజుకీ నిత్యవసరాలు వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పప్పులు, నూనెలు గ్యాస్, పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కానీ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు మాత్రం అరకొరగానే ఇస్తున్నారు.కాంట్రాక్టర్స్ ఎవరూ కార్మిక చట్టాలను వేటినీ అమలు పరచకుండా సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనంగా రూ. 26 వేల వేతనం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
కార్మికులందరికీ ప్రతీనెలా పే సిప్పులు ఇవ్వాలని చట్టంలో ఉన్నా ఎవరికి ఇవ్వడం లేదు. పే సిప్పులు ఇవ్వకపోవడంతో సెలవులు ఎన్ని, బేసిక్, డిఎ ఎంత అనే వివరాలు తెలియడం లేదు. పిఎఫ్ సొమ్ము ఎంత కటింగ్ అవుతున్నదనే సమాచారం తెలియకుండా కాంట్రాక్టర్లు గోప్యంగా ఉంచుతున్నారు. చట్టం ప్రకారం పిఎఫ్ సొమ్ము ఎప్పటికప్పుడు ఖాతాలలో జమ చేయాల్సి వున్నా కార్మికులకు తెలియనివ్వడం లేదు.










