రాయచోటిటౌన్ : పేదలకు కంటి చూపును ప్రసాదించడం వారి జీవితానికే వెలుగు నివ్వడమని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సంబేపల్లె మండ లంలోని మోటకట్ల గ్రామంలో పలవుల సుబ్బారెడ్డి, వాసుదేవమ్మ దంపతుల స్మారకార్థం సర్పంచ్ రాధిక, అమర్‌నాధ్‌రెడ్డి అధ్యక్షతన తిరుపతి ఎస్‌వి అరవింద్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య కంటి శిబిరం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ అరవింద్ కంటి ఆసుపత్రి ఎందరో అభాగ్యులకు కంటిచూపునివ్వడం ఆనంద దాయకమన్నారు. మోటకట్ల శివ సాయి ఆలయం ట్రస్టు తరుపున రెండవసారి కంటి వైద్య శిబిరం నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. మారుమూల గ్రామాల్లో ఉచిత క్యాంపు నిర్వహించి పేదలకు కంటిచూపు ఇవ్వడం గొప్ప సేవా కార్యక్ర మమని కొనియాడారు. దాతలు ముందుకు వచ్చి కార్పొరేట్ కంటి వైద్యాన్ని ఉచితంగా పేదలకు అందించి వారికి సేవ చేస్తుండడం మహాభాగ్యమని తెలిపారు. వైద్య నిపుణులు డాక్టర్ మహేష్, నందిని, గాయత్రి ఆధ్వర్యంలో 20 మంది కంటి వైద్య సిబ్బంది 180 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు .అందులో కంటి సమస్యలున్న 39 మందిని గుర్తించి వారిని ఆపరేషన్ నిమిత్తం వెంటనే బస్సులో ఉచితంగా తిరుపతి అరవింద ఆసుపత్రికి తరలించారు. సోమవారం ఉచితంగా ఆపరేషన్లు చేసి తిరిగి వారి స్వగ్రామాలకు పంపు తామని క్యాంపు మేనేజర్ జీవన్ రావు తెలిపారు. కార్యక్రమంలో శివ సాయి దేవాలయం ట్రస్ట్ సభ్యులు, విశ్రాంత అడిషనల్ ఎస్‌పి వెంకట నాథ్ రెడ్డి, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ రామచంద్రారెడ్డి, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఆవుల విష్ణువర్ధన్ రెడ్డి, మండల వైఎస్‌ఆర్ సిపి నాయకులు గొర్ల రమేష్ రెడ్డి, ఎంపిటిసి కాకులపల్లె రమణా రెడ్డి, నియోజక వర్గ బిసి సెల్ కార్యదర్శి నాగరాజు యాదవ్, మండల వ్యవసాయ సలహా సంఘ అధ్యక్షుడు వాసుదేవ రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి, జె సి ఎస్ మండల కన్వీనర్ వడ్డీ వెంకట రమణా రెడ్డి, ఉప సర్పంచ్ సుధీర్ రెడ్డి, స్కూల్ కమిటీ చైర్మన్ మధు, పెద్ద రామయ్య పాల్గొన్నారు.










