మన రాష్ట్రానికి ద్రోహం చేసింది బిజెపి. దీనిపట్ల వైయస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం వైఖరి ఏమిటి అనేదాన్ని బట్టి ఆ పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఉంటుంది. అదే సమయంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే రాజీ పడకుండా కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. ఈ విషయం ఆ రెండు పార్టీలకు అర్ధం అయినా కావాలనే దాస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలలో కమ్యూనిస్టులను అటో, ఇటో లాగాలని వారు భావిస్తున్నారు. గతంలో దీర్ఘకాలం సాగిన పొత్తు రాజకీయాలు కూడా దీనికి ఒక కారణం. కానీ అనుభవం నుంచి నేర్చుకున్న సిపియం స్వతంత్రంగా ప్రజా పునాదిని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. నూతన ఆర్థిక విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కూడగట్టాలని సిపియం తాజా రాష్ట్ర మహాసభలో నిర్ణయం తీసుకున్నది. పార్టీ స్వతంత్ర శక్తిని, జోక్యాన్ని పెంచాలని అఖిల భారత మహాసభ రాజకీయ తీర్మానం ముసాయిదా పేర్కొన్నది. ఈ స్వతంత్ర వైఖరి నచ్చనివారే సిపియంపై దాడి చేస్తున్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆందోళన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు స్వయంగా కమ్యూనిస్టులపై దాడికి తెరలేపారు. వారి సోషల్ మీడియా బృందం మరింత రెచ్చిపోయి ఈ దాడిని కొనసాగిస్తున్నది. ఈ రోజు వున్నట్లుండి కమ్యూనిస్టులపై ఇంత తీవ్రంగా దాడి చేయటానికి కారణం ఏమిటి? రాష్ట్రంలో ఉన్న తక్షణ రాజకీయాలా? ఉద్యోగుల ఆందోళనలకు మద్దతు ఇవ్వటం ఇష్టం లేకనా? లేక దీని వెనుక ఇంకేదైనా నిగూఢమైన ఎజెండా ఉందా? తాజా దేశ రాజకీయాలను పరిశీలిస్తే దీనికి సమాధానం దొరుకుతుంది.
మోడీ అధికారం చేపట్టాక దేశాన్ని అభివృద్ధి చేసి యువతకు బంగారు భవిష్యత్తు ఇస్తామని అరచేతిలో వైకుంఠం చూపించారు. కానీ వాస్తవంలో ఆర్థిక సంక్షోభం తీవ్రతరమైంది. నిరుద్యోగం 45 సంవత్సరాల రికార్డు దాటిపోయింది. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య ప్రజల ఆదాయాలు కుంచించుకుపోతున్నాయి. ఆర్థిక వ్యత్యాసాలు తీవ్రతరమవుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించటంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ దాడికి అండగా నిలబడింది. సహజ వనరులను యథేచ్ఛగా దోచుకోవటానికి, నల్లేరు మీద బండి లాగా వారి దోపిడీని కొనసాగించటానికి పెరుగుతున్న ప్రజా ఉద్యమాలు ఆటంకంగా మారుతున్నాయి. చారిత్రాత్మక రైతు ఉద్యమం మొదలుకొని ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమాలు, విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం, విద్యార్థుల పోరాటాలు, మహిళ, దళిత, ఆదివాసీ ఉద్యమాలు, తాజా ఉద్యోగుల ఆందోళన ఇవన్నీ అందులో భాగమే. సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వాలు ఆందోళనలను నిరంకుశంగా అణచటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఉద్యమాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్పొరేట్ ప్రయోజనాలను దెబ్బతీసేవే. తమ మార్కెట్లను, లాభాపేక్షను కాపాడుకోవటానికి శ్రామిక వర్గాలపై కార్పొరేట్ శక్తులు దాడి సాగిస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపు మొదలుకొని జీతభత్యాల కోత వరకు అన్నీ ఈ కోవలోనివే. కార్పొరేట్లకు చౌకగా లేబర్ దొరకాలంటే ప్రభుత్వ రంగం బలహీనంగా ఉండాలి. అందులో పనిచేసే వారికి జీతాలు తక్కువగా ఉండాలి. నష్టపోతున్న శ్రామికుల పక్షాన కమ్యూనిస్టులు, కార్మిక తదితర ప్రజాతంత్ర సంఘాలు నిలబడుతున్నాయి. ప్రజల మధ్య ఐక్యత కోసం కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. వారిని చీల్చి ప్రజా ఉద్యమాలను బలహీన పర్చటానికి పాలక వర్గాలు కుట్ర పన్నుతున్నాయి. అందుకు కులం, మతం, ప్రాంతం లాంటి ఏ ఒక్క అంశాన్ని వారు వదలటం లేదు. బిజెపి మతోన్మాదం కార్పొరేట్ శక్తులకు పెద్ద అండగా ఉంది. మతోన్మాదం, కార్పొరేట్ శక్తుల అపవిత్ర కూటమి ఈ రోజు దేశాన్ని శాసించాలని చూస్తున్నది.
మన రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడటంలో మోడీకి ఏమీ తీసిపోవటం లేదు. మన రాష్ట్రమూ అదానీ, అంబానీల స్థావరంగా మారింది. గంగవరం పోర్టు వాటాను అదానీపరం చేయటం తాజా ఉదాహరణ. కృష్ణపట్నం ఓడరేవు ఎప్పుడో వారి పరమైపోయింది. అలాగే మన రాష్ట్రానికి చెందిన పలు కార్పొరేట్ శక్తులు జాతీయ స్థాయికి ఎదిగాయి. వారికీ కార్మికోద్యమాల పొడ గిట్టడం లేదు. ఈ విధానాలను వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని, ప్రతిష్టను దెబ్బ తీయకుండా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడలేరు. పైకి ఏమి చెప్పినా అసలు రహస్యం అదే. ఉద్యోగులలో అసంతృప్తి లేదని, కమ్యూనిస్టులు ఇంకా ఎక్కడ ఉన్నారని చెప్తున్న వారే పనికట్టుకొని కమ్యూనిస్టులపై పథకం ప్రకారం దాడి చేస్తున్నారంటేనే వాస్తవమేమిటో అర్ధమవుతుంది.
మూడు దశాబ్దాల క్రితం సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత సోషలిజంపై ప్రజల్లో విశ్వాసం తగ్గింది. ఆర్థిక సంస్కరణలు ఊపుగా వున్న కాలంలో కమ్యూనిస్టులు బలహీనపడ్డారు. కాని ఇప్పుడు ఒకదాని వెంట ఒకటిగా ఆర్థిక సంక్షోభాలు పెట్టుబడిదారీ వర్గాన్ని చుట్టుముట్టాయి. అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. పాలకులు మారిపోతున్నారు. కార్పొరేట్ శక్తులు ఈ ప్రమాదాన్ని గుర్తించి రాజకీయాలపై తమ పట్టును పెంచాయి. ఈ క్రమంలోనే మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరలేపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ దీనికి నాంది పలికాడు. ప్రజల్లో కమ్యూనిజం, సోషలిజంపై తిరిగి చర్చ సాగుతోంది. అదే పాలక పార్టీలకు కంటగింపుగా మారింది. మారుతున్న పరిస్థితులను గుర్తించడానికి ఈ పార్టీలు నిరాకరిస్తున్నాయి. మొండిగా అధికారాన్ని కాపాడుకోవటానికి పెత్తందారీ, నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నాయి.
మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి చేసిన ద్రోహం ప్రజలపై బలమైన ముద్ర వేసింది. తమ రాజకీయ ప్రాబల్యం కోసం మతోన్మాద ఎజెండాను రుద్దాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. బిజెపి కేంద్ర నాయకులు సైతం దిగి దీనికి ఊతం ఇస్తున్నారు. గుడిని, గోపురాలను, రథాలను, కట్టడాలను వివాదం చేసి మత విద్వేషాలను పెంచాలని చూస్తున్నారు. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం వారికి లొంగిపోయి మతోన్మాద రాజకీయాలకు వంత పాడుతున్నాయి. బిజెపి మతోన్మాద ఎజెండాకు ప్రజా ఉద్యమాలు చెక్ పెడుతున్నాయి. నేడు బిజెపి విచ్ఛిన్న రాజకీయాలకు సవాలుగా నిలబడింది కమ్యూనిస్టులే. అందుకనే మతోన్మాద శక్తులకు కమ్యూనిస్టులంటే కడుపు మంట. అటు కార్పొరేట్ ప్రయోజనాలు, ఇటు మతోన్మాద బిజెపి ఒత్తిళ్ళు కమ్యూనిస్టులపై దాడికి ఉసిగొల్పుతున్నాయి. 2019 ఎన్నికల తరువాత బిజెపి ద్రోహంపై ఒక్కసారి కూడా నోరు విప్పని జగన్ మోహన్ రెడ్డి గారు పనిగట్టుకొని కమ్యూనిస్టులపై దాడికి దిగారు. నేరుగా కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తే ప్రజలు సహించరు కాబట్టి అప్రతిష్టపాలైన తెలుగుదేశంతో ముడిపెట్టి కమ్యూనిస్టుల ప్రతిష్టను మసకబార్చాలనే ప్రయత్నం వైయస్‌ఆర్‌సిపి చేస్తున్నది.
రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం పార్టీలు ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టనట్లుగా కనిపిస్తుంటుంది. అధికారం, పదవుల కోసం వారి మధ్య తీవ్ర వైరుధ్యాలు వుండవచ్చు. కానీ విధానపరంగా ఇద్దరి ఆలోచనలు ఒక్కటే. నాడు చంద్రబాబు నాయుడు ప్రపంచబ్యాంకు సంస్కరణలు తీసుకు వస్తే, అవే విధానాలను మరో పేరుతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఇద్దరూ తమ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేసినా ప్రశ్నించటం లేదు. రెండు పార్టీల నాయకులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బిజెపి నాయకులను ప్రసన్నం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నా పల్లెత్తు మాట అనరు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు, మూసేశారు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి అదే పని చేస్తున్నారు. కృష్ణపట్నం జెన్‌కోను రాష్ట్ర ప్రభుత్వం అదానికి ధారాదత్తం చేస్తున్నది. సహకార చెక్కర, పాల సంఘాలను రెండు పార్టీలు దెబ్బతీశాయి. అందువల్ల మౌలికమైన ఆర్థిక విధానాలలో ఇద్దరికీ తేడా లేదు. తెలుగు ప్రజల భావోద్రేకాలకు అనుగుణంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మాటవరసకు వ్యతిరేకిస్తున్నప్పటికీ గట్టిగా నిలబడి తెగువతో పోరాటానికి రావటం లేదు. ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ఇద్దరూ కీచులాడుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలను పోటీలు పడి ప్రకటిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాటగా వీరి తీరున్నది. ఎవ్వరు అధికారంలో ఉన్నా ఈ విధానాలపై పోరాటంలో కమ్యూనిస్టులు ముందున్నారు. వివిధ వర్గాలు, తరగతులు చేస్తున్న పోరాటాలకు అండగా ఉంటున్నారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు చేసిన పోరాటాలు వైయస్‌ఆర్‌సిపికి సంతోషాన్ని కలిగించాయి. అదే కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు పోరాటాలు చేస్తుంటే వైయస్‌ఆర్‌సిపికి కంటగింపుగా వుంది. ఆనాడు ఇదే రీతిలో కమ్యూనిస్టులపై దాడి చేసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైయస్‌ఆర్‌సిపి వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలని కమ్యూనిస్టులను కోరుతున్నది.
ఈ దేశానికి, ప్రజలకు ప్రధాన శత్రువు బిజెపి. మన రాష్ట్రానికి ద్రోహం చేసింది బిజెపి. దీనిపట్ల వైయస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం వైఖరి ఏమిటి అనేదాన్ని బట్టి ఆ పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఉంటుంది. అదే సమయంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే రాజీ పడకుండా కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. ఈ విషయం ఆ రెండు పార్టీలకు అర్ధం అయినా కావాలనే దాస్తున్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాలలో కమ్యూనిస్టులను అటో, ఇటో లాగాలని వారు భావిస్తున్నారు. గతంలో దీర్ఘకాలం సాగిన పొత్తు రాజకీయాలు కూడా దీనికి ఒక కారణం. కానీ అనుభవం నుంచి నేర్చుకున్న సిపియం స్వతంత్రంగా ప్రజా పునాదిని పెంచుకోవాలని నిర్ణయించుకుంది. నూతన ఆర్థిక విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కూడగట్టాలని సిపియం తాజా రాష్ట్ర మహాసభలో నిర్ణయం తీసుకున్నది. పార్టీ స్వతంత్ర శక్తిని, జోక్యాన్ని పెంచాలని అఖిల భారత మహాసభ రాజకీయ తీర్మానం ముసాయిదా పేర్కొన్నది. ఈ స్వతంత్ర వైఖరి నచ్చనివారే సిపియంపై దాడి చేస్తున్నారు. కమ్యూనిస్టులు ఈ రోజు బలహీనంగా ఉన్నా ప్రజలలో విశ్వసనీయత ఉన్నది. అదే దానికి కొండంత బలం. ఆ ప్రజల అండతోనే మున్ముందు మరిన్ని ప్రజా ఉద్యమాలు సాగిస్తారు. ఈ క్రమంలో ఎన్ని నిర్బంధాలైనా, దాడులనైనా, తప్పుడు ప్రచారాలనైనా ఎదుర్కొని నిలబడతారు.
వి. శ్రీనివాసరావు / వ్యాసకర్త : సిపియం రాష్ట్ర కార్యదర్శి /










