- హోల్డింగ్స్‌లో పెరుగుదల
- చిన్న, సన్నకారుపై తీవ్ర ఒత్తిడి
- భూకేంద్రీకరణ దిశ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రాష్ట్రంలో సగటు భూకమతం సైజు అంతకంతకూ తగ్గుతుండగా మొత్తం కమతాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో భూకేంద్రీకరణ సైతం పెరిగింది. చిన్న, సన్నకారు, సెమి మీడియం, మీడియం తరగతి రైతుల సగటు భూకమతం సైజు క్షీణించడమో లేదంటే అలానే ఉండటమో జరగ్గా భారీ భూకమతాల సైజు పెరిగింది. ఈ విషయాలు ప్రభుత్వం మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2021-22- సామాజిక, ఆర్థిక సర్వేలో నిక్షిప్తమయ్యాయి. దేశ వ్యాప్తంగా భూకమతాల (ల్యాండ్ హోల్డింగ్స్) వివరాల సేకరణ ప్రతి ఐదేళ్లకోసారి చేపడతారు. 2010-11 తర్వాత 2015-16లో గణాంకాలు సేకరించారు. మరో మారు 2020-21 వివరాలు సేకరించాలి. ఇప్పటికైతే 2015-16 గణాంకాలే అందుబాటులో ఉన్నాయి. ఆ ప్రకారం రాష్ట్ర సగటు భూకమతం 0.94 హెక్టార్లు. ఐదేళ్లకు ముందు 1.06 హెక్టార్లు. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 80.97 లక్షల హెక్టార్లు రైతులు సాగు చేయగా ఐదేళ్లలో అది 80.04 లక్షల హెక్టార్లకు తగ్గింది. కమతాలు 76.21 లక్షల నుండి 85.34 లక్షలకు పెరిగాయి. ఐదేళ్లలో దాదాపు తొమ్మిదిన్నర లక్షల కమతాలు పెరిగాయి. భూమిపై ఆధారపడేవారి సంఖ్య ఎక్కువవుతోంది. సాగుపై ఒత్తిడి పెరుగుతోంది. జిల్లాలవారీగా చూస్తే 0.51 హెక్టార్లతో సగటు హోల్డింగ్ శ్రీకాకుళం అతి తక్కువ కాగా గరిష్టంగా అనంతపురంలో 1.63 హెక్టార్లు.
సన్నకారుపై తీవ్ర ప్రభావం
సన్నకారు రైతు కమ తాలు ఐదేళ్ల క్రితం 49.84 లక్షలుండగా 59.04 లక్షలకు పెరిగాయి. మొత్తం హోల్డింగ్స్‌లో సన్నకారు తరగతి వాటా 65.40 శాతం నుండి 69.26 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో వారి వద్ద భూమి 21.60 లక్షల హెక్టార్ల నుండి 23.36 లక్షల హెక్టార్లకు పెరిగింది. రాష్ట్రంలో మొత్తం సాగు భూమిలో వీరి వద్ద ఉన్న భూమి 26.68 శాతం నుండి 29.19 శాతానికి పెరిగింది. రాష్ట్ర సగటు హోల్డింగ్ సైజు కంటే సన్నకారు హోల్డింగ్ సైజు సగం తక్కువ. సన్నకారు రైతు కమ తం సైజు 0.43 హెక్టారు నుండి 0.40 హెక్టారుకు కుదించుకుపోయింది. సన్నకారు రైతు కమతాలు తూర్పుగోదావరిలో గరిష్టం కాగా కడపలో కనిష్టం.
చిన్న రైతూ అంతే
చిన్న రైతు కమతాలు 15.91 లక్షల నుండి 16.46 లక్షలకు పెరిగాయి. మొత్తం కమతాల్లో 20.88 శాతం నుండి 19.31 శాతానికి తగ్గాయి. వీరి చేతుల్లోని భూమి 22.51 లక్షల హెక్టార్ల నుండి 23.34 లక్షల హెక్టార్లకు పెరిగింది. మొత్తం సాగు భూమిలో చిన్న రైతుల వాటా 27.80 శాతం నుండి 29.16 శాతానికి పెరిగింది. చిన్న రైతు సగటు కమతం సైజు 1.41 హెక్టారు నుండి 1.42 హెక్టారుకు అతి స్వల్పంగా పెరిగింది. ఇక సెమీ మీడియం, మీడియం కమతాలు, వారి చేతుల్లో భూమి, సగటు కమతం సైజు ఈ కాలంలో తగ్గాయి. అనంతపురంలో చిన్న, సెమిమీడియం, మీడియం, కమతాలు గరిష్టం కాగా విజయనగరం, శ్రీకాకుళంలో కనిష్టం.
భారీ భూకమతం పైకి
సగటు భారీ భూకమతం సైజు పెరిగింది. కమతాలు 20 వేల నుండి 15 వేలకు తగ్గగా మొత్తం కమతాల్లో 0.26 శాతం నుండి 0.18 శాతానికి తగ్గాయి. వారి చేతుల్లో భూమి 3.04 లక్షల హెక్టార్ల నుండి 2.76 లక్షల హెక్టార్లకు తగ్గింది. మొత్తం భూమిలో 3.75 శాతం నుండి 3.45 శాతానికి తగ్గింది. అయితే సగటు కమతం సైజు 15.28 హెక్టార్ల నుండి 18.71 హెక్టార్లకు పెరిగింది. ఈ పరిణామం భూకేంద్రీకరణను సూచిస్తోందని ఆర్థిక వేత్తలు విశ్లేషిస్తున్నారు. పెద్ద కమతాలు అనంతపురంలో గరిష్టం కాగా శ్రీకాకుళం, గుంటూరులో సున్నాగా తెలిపారు.











