Mar 13,2023 22:22

కదిరి మాడా వీధుల గుండగా కొనసాగుతున్న నారసింహుని రథోత్సవం

         కదిరి అర్బన్‌ : కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాముఖ్యమైన బ్రహ్మరథోత్సవం సోమవారం నాడు కమనీయంగా జరిగింది. అశేష జనవాహిని నడుమ అంగరంగ వైభవంగా రథోత్సవం కొనసాగింది. భారతదేశంలోనే 3వ అతిపెద్ద తేరుగా చెప్పుకున ఈ రథోత్సవం కనులపండువగా సాగింది. ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మందితో కదిరి మాడావీధులు కిక్కిరిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు నిర్ణయించిన సమయానికి రథోత్సవం ప్రారంభం అయ్యింది. పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు ఆనవాయితీగా ప్రత్యేక చేయాల్సిన పూజలన్నింటినీ పూర్తి చేసి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఉదయాన్నే ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలతో ఎమ్మెల్యే డాక్టర్‌ పివి.సిద్ధారెడ్డి పాలకమండలి ఛైర్మన్‌ గోపాలకష్ణ, ఆలయ ఈవో గురుప్రసాద్‌, ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. గోవింద, నారసింహస్వామి నామ స్మరణలతో తిరువీధులన్నీ మారుమోగాయి. స్వామివారికి ప్రీతి అయిన దవనం, మిర్యాల గుమ్మడికాయలు భక్తులు స్వామివారికి, భక్తులు మొక్కుబడులు చెల్లించారు. ఉత్సాహంగా భక్తులు మొకులు లాగి రథాన్ని యథాస్థానానికి చేర్చారు. రథోత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పోలీసుల భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం అన్నదాన కేంద్రాలు, మజ్జిగ, చల్లని పానీయాలు, మిఠాయిలను దాతలు పంపిణీ చేశారు.