1500 కిలోమీటర్ల శిలాఫలకం ఆవిష్కరణప్రజాశక్తి-చెన్నూరు
కమలాపురం నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాధ్‌రెడ్డి ఓ భూ కబ్జాకోరని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేరుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర 117 రోజుకు చేరుకుంది. సోమవారం మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలంలోని చెన్నముక్కపల్లె విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభమై కమలాపురం నియోజకవర్గంలోకి చెన్నూరు మండలంలోకి ప్రవేశిస్తుంది. కొండపేట, చెన్నూరు, ఉప్పరపల్లి క్రాస్, రామనపల్లె క్రాస్, చిన్నమాచుపల్లి, శేషయ్యవారిపల్లి మీదుగా కడప అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. ఇర్కాన్ సర్కిల్, ఆలంఖాన్‌పల్లి వద్ద 1500 కిలోమీటర్లకు పాదయాత్ర చేరిక సందర్భంగా శిలాఫలకం ఆవిష్కరించారు. వినాయక్‌నగర్ జంక్షన్, కడప శివారు బిల్టప్ సర్కిల్ విడిది కేంద్రం వరకూ పాద యాత్ర సాగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులు, రైతులు, ముస్లింములు, దివ్యాంగులతో ముఖాముఖి, మాటామంతి, సమావేశాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల లోకేష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఇసుక, మట్టి, గ్రావెల్ దందా, భూకబ్జాలకు కమలాపురాన్ని కేర్ ఆఫ్ అడ్రస్‌గా మార్చేసాడన్నారు. కొందరికి తాగుడు అంటే వ్యసనం మరి కొందరికి జూదం వ్యసనం ఎమ్మెల్యేకు మాత్రం భూకబ్జాలు అంటే వ్యసనమని తెలిపారు. పూర్వం బకాసురుడు ఊరికి ఒకరిని బలికోరినట్టుగా రవీంద్రనాథ్‌రెడ్డి పేదలు, ప్రభుత్వ, చివరికి శ్మశాన భూముల్ని సైతం కబ్జా చేస్తున్నాడని విమర్శించారు. కడప టౌన్ శివారు ప్రాంతంలో రూ.200 కోట్లు విలువ చేసే 54 ఎకరాల భూమిని కొట్టేసాడన్నారు. ఇప్పుడు అక్కడ వెంచర్ వేసి సెంటు రూ.13 లక్షలకు అమ్మేస్తున్నాడని తెలిపారు. లేపాక్షి భూములు లేపేయడానికి భారీ స్కెచ్ వేసాడన్నారు. రూ.20 వేల కోట్లు విలువైన 9 వేల ఎకరాల భూమిని చీప్‌గా రూ.500 కోట్లకు కొట్టేయడానికి ఒక కంపెనీలో కొడుకుని డైరెక్టర్‌గా చేర్చాడన్నారు. సర్వారాయ ప్రాజెక్టు సమీపంలో 400 ఎకరాలు ఆక్రమించి చేపల చెరువులు, పండ్ల తోటలు వేసాడన్నారు. వల్లూరు మండలం గొటూరు వద్ద రూ.100 కోట్ల విలువ చేసే పీర్ల మాణ్యం కబ్జా చేశారని తెలిపారు. కడప నగరంలోని మామిళ్ళపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్ 39, 60లో సుమారు రూ.130 కోట్లు విలువ చేసే 18 ఎకరాల భూమి కబ్జా చేశార న్నారు. వల్లూరు రెవెన్యూ ఆఫీస్ సమీపంలో రూ.7 కోట్లు విలువ చేసే భూమి కబ్జా చేశారన్నారు. కడప నగర శివార్లలో జయరాజ గార్డెన్ వద్ద పేదలను బెదిరించి రూ.130 కోట్లు విలువ చేసే చేసే 18 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. పెండ్లిమర్రి మండలంలోని పొలతల పుణ్యక్షేత్రం సమీపంలో బినామీ పేర్లతో సుమారు 200 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. బుగ్గ వంకను ఆక్రమించి ఏకంగా థియేటర్ కట్టాడన్నారు. కడప, కమలాపురంలో ఉన్న చుక్కల భూములను కాజేస్తున్నాడని తెలిపారు. సర్వారాయ సాగర్ వలన బాగుపడింది ఇద్దరేనని జగన్, ఆయన మేనమామనేనన్నారు. పెండ్లిమర్రి, వల్లూరు, సీకే దిన్నె మండలాల్లో చెరువులు మొత్తం కొల్లగొట్టి అనుచరులు కలిసి మట్టిని దోచుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజాధారణ చూసి జగన్ ఓర్వలేకపోతున్నారని తెలిపారు. నాపై కోడిగుడ్లు వేస్తే నీ కడుపు మంట తగ్గదన్నారు. క్లైమోర్ మైన్లకే భయపడని కుటుంబం మాదన్నారు. రూ.28 కోట్లతో టిడిపి హయాంలో హజ్ హౌస్ నిర్మించామని, ఆ భవనాన్ని వాడకుండా వదిలేసారని తెలిపారు. మైనార్టీలపై జగన్‌కి ఎంత కక్షో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలన్నారు. డిప్యూటీ సిఎం అంజాద్ బాషా సిఎంని ఎందుకు నిలదీయడం లేదన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత పధకాలు అమలు చేయడంతో పాటు, ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగస్తులను వేధిస్తున్నాడని, టీచర్లను లిక్కర్ షాపుల ముందు నిలబెట్టి అవమానించాడన్నారు. వారంలో సిపిఎస్ రద్దు చేస్తా అని 200 వారాలు దాటినా పట్టించుకోలేదన్నారు. పోలీసులు దాచుకున్న జిపిఎఫ్ డబ్బు సైతం కొట్టేసాడన్నారు.రాక్షసపాలనను అంతమొందిస్తేనే కడప జిల్లా వాసులకు స్వేచ్ఛ కలుగుతుందని తెలిపారు. సిఎం సొంత జిల్లాలోనే ప్రజల్లో తీవ్రస్థాయిలో అసంతప్తి ఉందని, కడప జిల్లాలోనూ జగన్ పనైపోయిందని పేర్కొన్నారు. జగన్‌ను నమ్ముకున్నవారే వైసిపి నుండి బయటకు వస్తున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ జగన్‌కు కడప జిల్లాలో ఎదురుగాలి వీచిందని పేర్కొన్నారు. ఇసుక మాఫియా ధనదాహం కారణంగా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 61 మంది అమాయకులు బలయ్యారని, వారికి ఇంతవరకు ఎటువంటి పరిహారం అందజేయలేదని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా ఇసుక ద్వారా జగన్ అండ్ కో రూ.10 వేల కోట్లు దోచుకున్నారని విమర్శించారు. నదుల నుంచి ఇసుకను పొరుగు రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. నదీజలాలను పరిరక్షిస్తూ ఇసుక విధానాన్ని సరళీకరించి స్థానికులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.










