ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శాసనసభ్యుల హక్కులు కాపాడటం తమ విధి అని ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ కాకాణి గోవర్థన్‌రెడ్డి పేర్కొన్నారు. అచ్చెన్నాయుడు మొదటిసారి ఇచ్చిన వివరణ సరిగ్గా లేకపోవడంతో రెండోసారి వివరణ కోరితే ఆయన పట్టించుకోలేదన్నారు. ఈ నేపథ్యంలో తర్వాత జరిగే ప్రివిలేజ్ కమిటీ ముందు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ మొదటి అంతస్తులో ప్రివిలేజ్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. సమావేశానంతరం చైర్మన్ మాట్లాడుతూ శాసనసభ్యుల హక్కుల పరిరక్షణకు త్వరలోనే జిల్లాల పర్యటన చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేల పేర్లు శిలాఫలకాల్లో లేకపోవడం, అధికారులు సరిగ్గా స్పందించకపోవడం, ప్రోటోకాల్ పాటించని విషయాలపై వచ్చిన ఫిర్యాదులపై చర్చించినట్లు పేర్కొన్నారు. సరైన సమాధానం చెప్పని సభ్యులను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించనున్నట్లు తెలిపారు.










