- వేలాది మంది పుస్తక ప్రియల సందర్శన
నిరుపమ్ సేన్ నగర్ నుంచి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : అక్కడికి వెళ్తే సమస్త విజ్ఞాన ప్రపంచం కళ్లముందే కనిపిస్తోంది. బాలల బమ్మల పుస్తకాలను నుంచి సైద్ధాంతిక, పరిశోధక పుస్తకాలు వరకూ స్వాగతం పలుకుతాయి. జాతీయ, అంతర్జాతీయ చారిత్రిక పుస్తకాల నుంచి మారుమూల పల్లెల్లోని పరిస్థితులు, ఉద్యమ పోరాటాలను వివరించే పుస్తకాల వరకూ అక్కడ కొలువు తీరి ఉన్నాయి.
సిపిఎం 23వ అఖిల భారత మహాసభల సందర్భంగా ఇక్కడ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు. 68 జాతీయ, అంతర్జాతీయ, మలయాళీ, తెలుగు పబ్లికేషన్లకు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందులో వివిధ అంశాలకు సంబంధించి వేలాది పుస్తకాలూ ఉన్నాయి. ప్రతిరోజూ దాదాపు మూడు వేల మంది పుస్తక ప్రియలు బుక్ ఫెస్టివల్‌ను సందర్శిస్తున్నారు. తమకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ప్రజాశక్తి, నవ తెలంగాణ, చేతన్ పబ్లిషర్, సమతా ఉమెన్స్ పబ్లిషింగ్, లెఫ్ట్‌వర్డ్, చింతా పబ్లికేషన్, భారతీయ పుస్తకశాలతో సహా ప్రఖ్యాత పబ్లికేషన్లు అక్కడ దర్శనమిస్తాయి. సైద్ధాంతిక, పోరాటాల ఘట్టాలు, అభ్యుదయ పుస్తకాలు, మహిళ సమస్యలను వివరిస్తున్న పుస్తకాలు, లైఫ్‌స్టైల్, చిన్నారుల్లో విజ్ఞానం పెంపొందే పుస్తకాలు.. ఇలా బహుళ పుస్తక ప్రపంచం కనిపిస్తోంది. రచయితలు, విద్యార్థులు, యువకులు, కవులు, ఉపాధ్యాయులు, కళాకారులు, రాజకీయ కార్యకర్తలు, చిన్నారులు ఈ బుక్ ఫెస్టివల్‌ను సందర్శిస్తున్నారు. కేరళలోని వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకంగా బుక్ ఎగ్జిబిషన్ కోసం పుస్తక ప్రియులు వస్తున్నారు. సిపిఎం మహాసభల సందర్భంగా ఇలా విజ్ఞానాన్ని పంచే పుస్తక ప్రదర్శన నిర్వహించటం అభినందనీయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.










