Jul 11,2022 23:36

ప్రజాశక్తి-విజయవాడ
పీకల్లోతు కష్టాల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో వారిచ్చిన వేలాది అర్జీలను జులై నెలాఖరు నాటికి ప్రభుత్వం పరిష్కరించాలని లేనట్లయితే జిల్లా కలెక్టరేట్‌ను దిగ్బంధించడం జరుగుతుందని సిపిఎం నేతలు హెచ్చరించారు. ప్రజాసమస్యలు పరిష్కరించాలని నగరంలోని జిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడికాశీనాధ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు చిగురుపాటి బాబురావు మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటమే తప్పా మరొక మార్గం లేదని, ప్రస్తుతం నిర్వహించిన ఈ ఆందోళన ఆరంభం మాత్రమేనని పేర్కొన్నారు. గత 40 రోజుల నుంచి విజయవాడ సిటీతో పాటు జిల్లా వ్యాప్తంగా సిపిఎం నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడం, ఆ సందర్భంగా వచ్చిన సమస్యల ఆధారంగా, ఎవరయితే సమస్యలు ఎదుర్కొంటున్నారో వారి నుంచే సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వేలాది అర్జీలను అందజేయడం జరిగిందన్నారు. వీటినిప్రభుత్వం పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను దిగ్బంధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఇంటింటికీ, వీధి వీధికి, ప్రాంతానికి ప్రాంతానికి సమస్యలు ఎక్కడికక్కడ తిష్టవేసి ఉన్నాయని పేర్కొన్నారు. ధరా భారం, పన్నుల మోత, నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు, పనులు లేక తగ్గిపోయిన రాబడి తదితర అనేక సమస్యలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని వైఎస్‌జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు పోటీలు పడి ప్రజలపై భారాలపై భారాలు మోపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు కరోనా పోయిందేమో కానీ మోడీ, జగన్‌ రూపంలో ఉన్న కరోనా పోయేటట్లుగా లేదని విమర్శించారు.
కిడ్నీ వ్యాధి బాధితులను ఆదుకోవాలి
సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి.కృష్ణ
సిపిఎం జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ... ప్రజాసమస్యలు పరిష్కరించేంత వరకు సిపిఎం ప్రజలకు అండగా నిలుస్తుందని అన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలోని ఎ. కొండూరు మండలంలోని పలు గ్రామలతోపాటు ఇతర గ్రామాల్లో కిడ్నీ వ్యాధితో వందల మంది ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి సరైన అవగాహన లేకపోయినా, సిపిఎం ప్రజల తరుపున నెలల తరబడి అధ్యయనం చేసి, సమగ్ర నివేదికను ప్రభుత్వానికి నివేదించినా దాని గురించి పట్టించుకునే తీరిక లేదన్నారు. కిడ్నీ ఆస్పత్రి ఏర్పాటు చేయడంతో పాటు మృతిచెందిన వారి కుటుంబాలకు ఎకరం భూమి, ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కిడ్నీ వ్యాధి బారిన పడుతున్న గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని కోరారు. జగ్గయ్యపేట మండలం షేర్‌ మహమ్మద్‌పేటలో ఫ్యాక్టరీల ద్వారా వచ్చే పొల్యూషన్‌ వల్ల భూగర్భజలాలు కలుషితమవుతున్నాయన్నారు.
నెలాఖరునాటికి అర్జీలను పరిష్కరించాలి
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్‌
అధ్యక్షత వహించిన కాశీనాధ్‌ మాట్లాడుతూ...తాము ఇచ్చిన అర్జీలను ఈ నెలాఖరు నాటికి పరిష్కరించకపోతే కలెక్టరేట్‌ను పోరాట కేంద్రంగా చేసుకొని ఉద్యమించడం జరుగుతుందని హెచ్చరించారు. కొండ ప్రాంతాల సమస్యలు, కృష్ణలంక 20 21 డివిజన్ల రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం, ఇళ్లు, ఇళ్ల పట్టాలు, టిడ్కో గృహాల పంపిణీ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కె శ్రీదేవి, పివి ఆంజనేయులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎన్‌సిహెచ్‌శ్రీనివాస్‌, కోటా కళ్యాణ్‌, విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ సిటీల కార్యదర్శులు భూపతి రమణరావు, బోయి సత్యబాబు (సిపిఎం ఫ్లోర్‌లీడర్‌), జిల్లా కమిటీ సభ్యులు పి కృష్ణ, కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ధర్నా సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజానాట్యమండలి కళాకారులు గేయాలాలపించారు.