హిందూపురం : హిందూపురం రూరల్ మండలంతో పాటు హిందూపురం పట్టణంలో కలెక్టర్ బసంత్‌కుమార్ మంగళవారం విసృతంగా పర్యటించారు. తొలుత రూరల్ మండలంలోని బాలంపల్లి, మలగూరు గ్రామాల్లో అసంపూర్తిగా ఉన్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలను పరిశీలన చేశారు. అనంతరం నింకంపల్లిలో చౌకదుకాణాన్ని పరిశీలించారు. హిందూపురం మండలం కిరికెర-1, 2, 3 గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా హిందూపురం మండలంలోని బాలంపల్లి, మలగూరు, కిరికెర గ్రామాల్లో ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను వెంటనే మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మండలంలో నిర్మాణంలో ఉన్న సచివాలయ భవన నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. ఇందులో ఎలాంటి ఆలస్యం ఉండరాదని, సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం నింకంపల్లి ఎఫ్‌పి షాపును తనిఖీ చేశారు. నాణ్యమైన బియ్యాన్ని, నిత్యావసర వస్తువులను అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కిరికెరలో సచివాయాలను తనఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాల పరిధిలో సర్వీసులను మరిన్ని పెంచాలన్నారు. సచివాలయ ఉద్యోగులు నిర్ణీత సమయంలోగా బయోమెట్రిక్ అటెండెన్స్‌ను ప్రతిరోజూ నమోదు చేయాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూర్చేలా జాగ్రత్తగా పరిశీలన చేయాలన్నారు. సచివాలయాల ద్వారా ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. సచివాలయాల పరిధిలోని రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అవసరమైన సూచనలు సలహాలు అందించాలని, ఎరువులు, పురుగు మందులను సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ నరేంద్రకుమార్, తహశీల్దార్ ప్రసాద్, సిఎస్‌డిటి హారతి, ఆర్‌ఐ భాస్కర్‌రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










