Jun 21,2022 23:52

మాట్లాడుతున్న జెసి మహేష్‌కుమార్‌

ప్రజాశక్తి-కలెక్టరేట్‌: జిల్లాలోని జూనియర్‌ కళాశాలలు నిర్వహించే కార్యకలాపాలపై జిల్లా మానిటరింగ్‌, సూపర్‌వైజింగ్‌ కమిటీ ప్రత్యేక నిఘా పెట్టాలని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌. మహేష్‌ కుమార్‌ అన్నారు.మంగళవారం వీడియో కాన్ఫరెన్సు హాల్లో జిల్లా మానిటరింగ్‌, సూపర్‌ వైజింగ్‌ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ కమిటీకి జాయింట్‌ కలెక్టర్‌ చైర్మన్‌ గా వ్యవహరిస్తుండగా వివిధ శాఖల నుంచి 10 మంది అధికారులు సభ్యులుగా ఉన్నారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మొత్తం 120 ప్రైవేట్‌, 8 ప్రభుత్వ, ఎయిడెడ్‌, సోషల్‌ వెల్ఫేర్‌, ఏపీఆర్జేసి జూనియర్‌ కళాశాలలు ఉండగా అందులో 40 వేలకు పైగా విద్యార్ధులు చదువుతున్నారన్నారు. జెఈఈ, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు పొందడమే లక్ష్యంగా ప్రయివేటు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయన్నారు. ఆ ఒత్తిడిని భరించలేని విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. అలాంటి స్థితిని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు, ఎయిడెడ్‌, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో జిఒ తీసుకువచ్చిందన్నారు. దాని ప్రకారం 10 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో ఈ విధమైన కమిటీ ఏర్పాటు ఎలాంటివి లేవన్నారు. జిల్లాల విభజనకు ముందు కష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు కలిపి ఒక డిస్ట్రిక్‌ ఒకేషనల్‌ ఎడ్యూకేషనల్‌ ఆఫీసర్‌ ఉండేవారని, ఇప్పుడు జిల్లాకు ఒకరిని చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నియమించడం జరిగిందన్నారు.ఈ కమిటీ సభ్యులు నెలకు ఒకసారి తప్పని సరిగా కనీసంగా 2 జూనియర్‌ కళాశాలలను సందర్శించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. కమిటీ సందర్శనకు వెళ్లినప్పుడు కళాశాలలోని లేట్నెట్‌ స్టడీ అవర్లు, శెలవు దినాల్లో కళాశాలలు నిర్వహించడం, హాస్టల్లో ఆహార నాణ్యత, మౌలిక సదుపాయాలు వంటి వాటిపై రిపోర్టును తయారు చేసి సమర్పించాలన్నారు. విద్యార్థులకు కౌన్సిలింగ్‌ నిర్వహించడం తల్లిదండ్రులతో తరచుగా సమావేశాలు నిర్వహించడంపై కమిటీ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, తద్వారా విద్యార్ధులు ఒత్తిడిని జయించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిస్ట్రిక్‌ ఒకేషనల్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ డి. విజయశ్రీ పాల్గొన్నారు.