పిఆర్‌సి అమలు కోసం జారీ చేసిన జీవో లను చూస్తే ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు వైఖరి అవలంభిస్తోందన్న భావన కలగడం సహజం. ప్రభుత్వం జారీ చేసిన నాలుగు జీవోల్లోనూ రికవరీ మాఫీ అంశాన్ని ప్రస్తావించకపోవడమే దీనికి కారణం. పొరపాటునో, ఏమరపాటునో ఈ విస్మరణ జరిగివుంటే ప్రభుత్వం నుండి ఈపాటికి వివరణ వచ్చి ఉండేది. తప్పు దిద్దుకునే ప్రక్రియ ప్రారంభం అయి ఉండేది. కానీ, పిఆర్‌సి జీవోలు జారీ అయి మూడు రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఈ దిశలో ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇది ఉద్దేశ్యపూర్వకంగా చేసిందనే భావించాల్సి వస్తోంది. దీనర్ధం చర్చల ప్రక్రియను అపహాస్యం చేయడమే! చర్చల సందర్భంగా ఒకటి చెప్పి, ఆచరణలో మరొకటి చేయడమంటే మాట తప్పడమే. ఈ తరహా విధానం దీర్ఘకాలంలో తీవ్ర హాని చేస్తుంది. ప్రభుత్వంపై నమ్మకం లేని పరిస్థితిని కలిగిస్తుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వమూ వేరు కాదు. వారంతా ప్రభుత్వంలో భాగమే. ఈ విషయాన్ని చర్చల సందర్భంగా మంత్రుల కమిటీ కూడా పదేపదే చెప్పింది. ప్రభుత్వ కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో అమలు కావాలంటే ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకం. కనుక పరస్పర విశ్వాసం చాలా ముఖ్యం.
నిజానికి, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో జరిపిన చర్చల్లో రికవరీ మాఫీ ఒక కీలకమైన అంశం. మధ్యంతర భృతి కంటే తక్కువ పిఆర్‌సి ని ప్రకటించిన ప్రభుత్వం ఆ తేడాను రికవరి చేస్తామని తెలిపింది. ఈ మేరకు జనవరి 17న జారీ చేసిన జీవో నెం.1లో 2019 జులై ఒకటి నుండి 2021 డిసెంబర్ 31 వరకు ఉద్యోగులకు చెల్లించిన మధ్యంతర భృతిలో అదనంగా ఇచ్చిన మొత్తాన్ని రికవరి చేస్తామని పేర్కొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ చర్య ఉద్యోగ ఉపాధ్యాయుల్లో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం కావడానికి కారణమైంది. జీవితకాలమంతా సేవ చేసి ఉద్యోగ విరమణ చేసిన పెన్షనర్లూ ఈ పిఆర్‌సి ప్రతిపాదన పట్ల పెదవి విరిచారు. సమాన పనికి సమాన వేతనం లభిస్తుందని ఎదురుచూసిన కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సైతం తీవ్ర నిరాశకు గురయ్యారు. సిపిఎస్ హామీ కూడా అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే జనవరి 20న ఫ్యాప్టో పిలుపు మేరకు ఉపాధ్యాయులు నిర్వహించిన జరిగిన కలెక్టరేట్ల ముట్టడి అనూహ్య స్థాయిలో విజయవంతమైంది. ఉద్యోగులను పోరాటంలోకి నడిపించింది. ఆ తరువాత పోరాట కమిటీ ఆవిర్భావం, ఫిబ్రవరి 3న అంచనాలకు మించి విజయవంతమైన 'చలో విజయవాడ' కార్యక్రమం చూపించిన ప్రభావం, అనంతర పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనసవరం లేదు. ఆ తరువాత జరిగిన చర్చల ప్రక్రియలో ఐ.ఆర్ రికవరీని మాఫీ చేయడానికి అంగీకరించినట్లు మంత్రుల కమిటీ ప్రకటించింది. ఆరవ తేదీన సి.ఎం వద్ద జరిగిన సమావేశంలోనూ ఇదే విషయం చెప్పారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. అయితే, ఈ చర్చల ఫలితమంటూ ప్రభుత్వం తాజాగా జారీ చేసిన నాలుగు జీవో ల్లోనూ రికవరీ మాఫీ అంశం లేకపోవడం దారుణం. ఇప్పటికే ఐ.ఆర్ కన్నా తక్కువ ఫిట్‌మెంట్ ఇచ్చిన ప్రభుత్వం దాదాపుగా 5, 400 కోట్ల రూపాయలను ఉద్యోగులు, ఉపాధ్యాయల నుండి వసూలు చేయడానికి సిద్ధం కావడం అన్యాయం. పిఆర్‌సి వల్ల అదనపు ప్రయోజనం లేకపోగా, ఇప్పటికే పొందిన జీతాన్ని ఉద్యోగులు తిరిగి చెల్లించాల్సి రావడం విచారకరం! ఇటువంటి పరిస్థితి రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేదు.
ఫిట్‌మెంట్‌తో పాటు, వివిధ అంశాల్లో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి, ఆందోళనలు చేస్తున్నాయి. చర్చల సందర్భంగా నెలకొన్న ఆ అసంతృప్తికి, ప్రభుత్వం అనుసరిస్తున్న తాజా కక్షపూరిత వైఖరి కూడా తోడైతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళన మరింతగా రగిలే అవకాశం ఉంది. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. చిత్తశుద్ధి ఏ మాత్రం ఉన్నా ఉద్యోగ, ఉపాధ్యాయుల నుండి రికవరీ చేయదలచిన మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్లు తక్షణం ఉత్తర్వులు ఇవ్వాలి. పిఆర్‌సి ప్రక్రియపై కూడా పునరాలోచించాలి. ఫిట్‌మెంటును 27 శాతం వర్తింపచేయాలి. మార్పు చేసిన హెచ్‌ఆర్‌ఏ రేట్లను 2022 జనవరి నుండి కాకుండా 2020 ఏప్రిల్ ఒకటి నుంది అమలు చేయాలి. ఈ తరహా చర్యలతోనే ఉద్యోగ, ఉపాధ్యాయులలో సడలిన నమ్మకాన్ని తిరిగి పొందడం ప్రభుత్వానికి సాధ్యమవుతుంది.










