వాళ్లు -
భూగోళమంత ఆశతో కళ్ళు తెరుస్తారు
గాలులంత స్వేచ్ఛగా ఊరేగుతారు
పువ్వులంత స్వచ్ఛంగా ఊసులాడుతారు
కాళ్ళకు మువ్వల పట్టీలు కట్టి
నేలను అందంగా నడిపిస్తారు
నింగి తలకు రంగుల తల పాగా చుట్టి
ముఖానికి బుర్ర మీసం తగిలించి
వీధుల్లో తిప్పి ఆనందిస్తారు
దిగాలుగా ఉన్న దిక్కుల భుజాల మీదెక్కి
కోతి చేష్టలు చేసి నవ్విస్తారు
గడప గడపకో బంగారు లోకాన్ని
గది గదికో సూరీడ్ని
గుమ్మం గుమ్మానికో జాబిల్లినీ బహూకరిస్తారు
నాన్నను చక్రవర్తిని చేసి
అమ్మను మహారాణిగా మార్చి
వాళ్లే గెలిపించుకున్న మమతల దేశాలకు
కిరీటాల్లేని ఏలికలవుతారు
వాళ్ళకి -
చిర్నవ్వుల కంకుల్ని పరపరా కోసే
కొడవళ్ళుంటాయని తెలీదు
మనుషుల చేతుల్లో
ఎగిరే పతంగాల దారాల్ని తెంపేసే
అసూయ కళ్ళుంటాయని తెలీదు
పసిపిల్లల్ని సూట్ కేసులతో తూకం వేసే
అనైతిక తక్కెడలుంటాయని తెలీదు
లేత దేహాల్లో దాహాల్ని తీర్చుకునే
అమానుష వాంఛలుంటాయని తెలీదు
శుభాకాంక్షలు చెబుదాం సరే
వాళ్ళ నవ్వులకేం భరోసా ఇస్తాం?
ఏ చేతులడ్డంపెట్టి
ఆ పసిదీపాల్ని కాపాడుకుంటాం!
రేపు నువ్వు ప్రేమగా పెంచుకుంటున్న
పూల మొక్క నీ దగ్గరకొచ్చి
నిన్నంతా నాతో కలిసి ఆడుకున్న ఆసిఫా
ఏదండీ అని అడిగితే
ఏ కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటాం?
- సాంబమూర్తి లండ,
సెల్: 96427 32008










